వాళ్ల ఎమోషన్స్​ని అర్థం చేసుకోవాలి

వాళ్ల ఎమోషన్స్​ని అర్థం చేసుకోవాలి

వయసు పెరుగుతున్న కొద్దీ డయాబెటిస్​, బీపీ, ఎముకలు, కండరాలు బలహీనమవడం, కీళ్ల నొప్పుల వంటి సమస్యలొస్తాయి. కానీ, వీటన్నింటికీ మించి వయసుతో వచ్చే డిప్రెషన్​ పెద్దవాళ్లని ఎక్కువ ఇబ్బందిపెడుతుందని స్టడీలు చెప్తున్నాయి. రిటైర్‌మెంట్‌ వల్ల ఏమీ తోచకపోవడం, వాళ్లతో టైం​ స్పెండ్​ చేసే తీరిక ఎవరికీ లేకపోవడం లేదా జీవిత భాగస్వామి దూరం కావడం.. లాంటి కారణాలెన్నో మానసికం ఒత్తిడికి గురిచేస్తాయి. ఇలాంటప్పుడే పిల్లలు, కుటుంబ సభ్యులు వాళ్ల ఎమోషన్స్​ని అర్థం చేసుకోవాలి.

ఓపిక అవసరం

వయసు మీద పడే కొద్దీ మెదడు పరిమాణం తగ్గుతుంటుంది. న్యూరాన్ల పనితీరు మందగిస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి,ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది. దాంతో పాత విషయాలు, పేర్లు, ముఖాలే కాదు  చివరికి ఇంట్లో వాళ్లని, రోజూ చేసే పనుల్ని కూడా మర్చిపోతుంటారు. వీటికి తోడు అల్జీమర్స్‌, డిమెన్షియా లాంటి సమస్యలు పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. అందుకే  పెద్దవాళ్లలో వస్తున్న మార్పుల్ని గమనించాలి. ముఖ్యంగా పిల్లలు... పెద్దవాళ్లని ఓపికగా చూసుకోవాలి. 

ఎక్స్​పెక్టేషన్స్​ వద్దు

ఇంతకుముందు చలాకీ​గా ఇంటిని, డబ్బు​ విషయాల్ని చక్కబెట్టిన అమ్మానాన్నల్ని నిస్సహాయ సిచ్యుయేషన్స్​లో చూడటం పిల్లలకి  ఇబ్బందే. కానీ, అదే రియాలిటీ. దాన్ని అందరూ యాక్సెప్ట్​ చేయాల్సిందే. అలాకాకుండ  కోప్పడ్డం, చిరాకు పడటం లాంటివి చేస్తే వాళ్ల మనసు నొచ్చుకుంటుంది. తమని తామే తక్కువ చేసుకుంటారు. ఒంటరిగా ఫీలవుతారు. అందుకే  పిల్లలు పేరెంట్స్​ వయసుని దృష్టిలో పెట్టుకుని.. దానివల్ల వచ్చే సమస్యల్ని యాక్సెప్ట్​ చేయాలి. వాటి గురించి అవగాహన పెంచుకుని, వాళ్లని సంతోషంగా ఉంచాలి.

డిప్రెషన్​ దరిచేరకుండా...

వయసు మీద పడుతున్న కొద్దీ భయాలు పెరుగుతుంటాయి పెద్దవాళ్లకి. జీవితం ముగిసిపోయిందన్న ఫీలింగ్స్​ పెరిగిపోతాయి. దీనికి ఒకింత కారణం చుట్టూ ఉన్నవాళ్లే అదెలాగంటే.. పెద్దవాళ్లు ఏదైనా పనిచేస్తున్నా ‘ఈ వయసులో నీకెందుకు’?  అంటారు. సరదాగా బయటికెళ్లే ఛాన్స్​ ఉండదు వాళ్లకి. నచ్చింది తినే అవకాశం లేదు. పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం ఇంట్లోవాళ్లు జాగ్రత్తతో చేసే ఈ పనులు  చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉంటున్నామన్న ఫీలింగ్స్‌ ఇస్తాయి వాళ్లకి. తాము ఎవరికీ నచ్చట్లేదన్న ఫీలింగ్​  వస్తుంది వాళ్లలో. ఇంత చిన్న విషయాలకేనా అని  చాలామందికి అనిపించినా.. వాళ్ల కోణం నుంచి చూస్తే ఇవి చాలా పెద్దవి. ఎందుకంటే ముసలితనంలో అందరూ పిల్లలే. అందుకే పసిపిల్లలతో ఎలా నడుచుకుంటారో వాళ్లతోనూ అలానే  ఉండాలి. వాళ్లకి పిల్లల  తోడు అవసరం అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఇన్​సెక్యూరిటీలు దరిచేరకూడదంటే వాళ్లని ఒంటరిగా వదిలేయకూడదు. వాళ్ల ఎమోషన్స్​ని, సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

స్పెషల్​ అటెన్షన్​ ఇవ్వాలి

అప్పటివరకు పిల్లలే ప్రపంచంగా బతుకుతుంటారు పేరెంట్స్​. పిల్లలూ అంతే. కానీ, పిల్లల జీవితంలోకి పార్ట్​నర్స్​, వాళ్ల పిల్లలు వచ్చాక కొన్ని మార్పులు వస్తాయి. వాటన్నింటి మధ్య పేరెంట్స్​కి ఎంత ఇంపార్టెన్స్​ ఇస్తున్నాం అన్న విషయం మీద కూడా దృష్టిపెట్టాలి. పిల్లలు తమని నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన పేరెంట్స్​కి రాకుండా చూసుకోవాలి. అందుకోసం వాళ్లకి టైం ఇవ్వాలి. వాళ్లతో ఉన్న జ్ఞాపకాల​ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుండాలి. ఇవన్నీ వాళ్లలో ఉత్సాహం పెంచుతాయి.  అలాగే వాళ్లతో  తోటపని చేయించడం, పుస్తకాలు చదివించడం లాంటివి చేయించినా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. 

మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి 

చెప్పిందే పదేపదే చెప్పడం, చిరాకు పడడం, నిస్సహాయత, బాధ, చిన్నచిన్న విషయాలకే భయపడటం లాంటివి.. ఆడవాళ్లలో యాభై ఏండ్ల నుంచి మగవాళ్లలో అరవై ఏండ్ల నుంచి కనిపిస్తుంటాయి. వీటికి కారణాలు ఏమైనా.. చుట్టూ ఉన్నవాళ్లు ఆ సిచ్యుయేషన్ ను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ముసలితనంలో ఎదుర్కొనే ఈ సమస్యల గురించి  పిల్లలకు అవగాహన ఉండాలి. చిన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు అవసరం ఎంత ఉంటుందో.. వయసు మీద పడిన పేరెంట్స్‌‌కు పిల్లల అవసరం అంతే ఉంటుంది. అందుకే వాళ్లతో వీలైనంత ఎక్కువ టైం గడపాలి.  పిల్లలు పేరెంట్స్‌‌కి దూరంగా ఉంటుంటే ఫోన్‌‌లో రోజూ మాట్లాడాలి. ‘మేమున్నాం’ అన్న భరోసా ఇవ్వాలి. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే .. తప్పకుండా సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్‌‌‌‌ను కలవాలి.

- డా. కె. జ్యోతిర్మయి, ఎమ్​.డి.
కన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్​, హైదరాబాద్​