అక్రమంగా భవన నిర్మాణం.. కార్పొరేటర్ భర్తకు షోకాజ్ నోటీసులు

అక్రమంగా భవన నిర్మాణం.. కార్పొరేటర్ భర్తకు షోకాజ్ నోటీసులు

సికింద్రాబాద్, వెలుగు : అక్రమంగా భవన నిర్మాణం చేపట్టిన నేరెడ్​మెట్ కార్పొరేటర్ మీనా రెడ్డి భర్త ఉపేందర్ రెడ్డికి బల్దియా కాప్రా సర్కిల్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాప్రా సర్కిల్ పరిధి మైత్రి ఎన్​క్లేవ్ ప్లాట్​నం.208లో ఉపేందర్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టాడు. మున్సిపాలిటీ నుంచి జీ ప్లస్ వన్​కు అనుమతి పొంది.. రూల్స్​కు విరుద్ధంగా రెండంతస్తుల బిల్డింగ్ నిర్మించాడు.

అలాగే గ్రౌండ్ ఫ్లోర్​లో షట్టర్లు సైతం నిర్మించాడని అధికారులు వెల్లడించారు. రూల్స్ బ్రేక్ చేసి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిర్మాణాలపై కాప్రా సర్కిల్ అధికారులు ఉపేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. లేకపోతే బల్దియా నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.