
- 21న ముగింపు
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ కంపెనీ శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ లిమిటెడ్, సూపర్‌మార్కెట్ చెయిన్ పటేల్ రిటైల్ లిమిటెడ్ ఆగస్టు 19న తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓల) ను ప్రారంభించనున్నాయి. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ) ప్రకారం, ఐపీఓలు ఈ నెల 21న ముగుస్తాయి. యాంకర్ ఇన్వెస్టర్లు ఆగస్టు 18న బిడ్స్ వేయొచ్చు. ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను సోమవారం ప్రకటిస్తాయి.
శ్రీజీ షిప్పింగ్..
ఈ కంపెనీ ఐపీఓలో 1.63 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) లేదు. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌లో రూ.251.2 కోట్లను సుప్రమాక్స్ డ్రై బల్క్ క్యారియర్లను కొనడానికి, రూ.23 కోట్లను అప్పులు చెల్లించడానికి ఉపయోగిస్తారు. జామ్‌నగర్‌కు చెందిన శ్రీజీ షిప్పింగ్, భారత పశ్చిమ తీరంలో నాన్-మేజర్ పోర్టులపై దృష్టి సారిస్తోంది.
పటేల్ రిటైల్..
ఈ కంపెనీ ఐపీఓలో 85.18 లక్షల షేర్ల తాజా ఇష్యూ ఉంది. ఓఎఫ్‌ఎస్ కింద 10.02 లక్షల షేర్లను షేర్‌హోల్డర్ల విక్రయించనున్నారు. ఐపీఓ సైజు రూ.250-–300 కోట్లు. ఫ్రెష్ షేర్ల ఇష్యూ ద్వారా వచ్చిన ఫండ్స్‌లో రూ.59 కోట్లను అప్పులు తీర్చడానికి, రూ.115 కోట్లను వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలినవి సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వాడతామని కంపెనీ చెబుతోంది. 2008లో ప్రారంభమైన పటేల్ రిటైల్, మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో తొలి స్టోర్ ప్రారంభించింది. ప్రస్తుతం థానే, రాయ్‌గఢ్‌లో విస్తరించింది. ‘పటేల్స్ ఆర్ మార్ట్’ బ్రాండ్‌తో ఆహారం, దుస్తులు, గృహోపయోగ వస్తువులను అమ్ముతోంది. ఈ రెండు కంపెనీల షేర్లు ఆగస్టు 26 న స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్టింగ్ అవుతాయి. ఈ ఏడాది 44 మెయిన్‌బోర్డ్ ఐపీఓలు వచ్చాయి.
ఈ వారం రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు
జ్యువెలరీ కంపెనీ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్‌స్టైల్ ఐపీఓ ఈ వారం 11 న ఓపెనై, 13న ముగియనుంది. ఐపీఓ ధరను రూ.492–-517 గా నిర్ణయించారు. మరో మెయిన్ బోర్డ్ ఐపీఓ రీగల్ రిసోర్సెస్ ఈ నెల 12న ఓపెన్ కానుంది. 14 న ముగుస్తుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ తన ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.96–102 గా నిర్ణయించింది.