రంజీల్లో శ్రేయాస్ అయ్యర్.. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడతాడా..?

రంజీల్లో శ్రేయాస్ అయ్యర్.. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడతాడా..?

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ కెరీర్ సందిగ్ధంలో పడినట్లుగానే కనిపిస్తుంది. సీనియర్లను కాదని దక్షిణాఫ్రికా సిరీస్ కు అయ్యర్ ను ఎంపిక చేస్తే రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో 41 పరుగులు చేసిన ఈ ముంబై బ్యాటర్ ఫామ్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ముంబై జట్టులో చేరిన ఈ స్టార్ ప్లేయర్..MCA శరద్ పవార్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో 12 నుండి 15 వరకు ఆంధ్రప్రదేశ్ జరగబోయే మ్యాచ్ లో ఆడనున్నాడు. రహానే ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

29 ఏళ్ల అయ్యర్ చివరిసారిగా 2018లో ముంబై తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు.దాదాపు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ రంజీ బాట పట్టాడు.  అయ్యర్ ఇప్పటివరకు 67 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 13 సెంచరీలతో 5407 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో దారుణంగా విఫలమవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. సెంచూరియన్‌లో మొదటి టెస్ట్ లో 31,6 పరుగులు చేసిన అయ్యర్.. కేప్ టౌన్ లో 0, 4* పరుగులు చేసాడు. ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ సిరీస్ కు సెలక్ట్ కాని ఈ ముంబై బ్యాటర్.. రంజీలాడి ఫామ్ లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. 

ఆంధ్ర ప్రదేశ్ తో మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు సిద్ధమవుతాడు. ఈ లోపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20 ల సిరీస్ ఆడుతుంది. ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా.. త్వరలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు. మొత్తానికి ఫామ్ అందిపుచ్చుకొనే అయ్యర్ ప్రయత్నం సఫలమవుతుందేమో లేదో చూడాలి.