యాక్సియం4 మిషన్ సక్సెస్..ISS లో పరిశోధనలు చేసిన తొలి భారతీయుడు శుక్లా

యాక్సియం4 మిషన్ సక్సెస్..ISS లో పరిశోధనలు చేసిన తొలి భారతీయుడు శుక్లా
  • కాలిఫోర్నియా సమీప సముద్ర తీరంలో​సేఫ్ ​ల్యాండింగ్​ అయిన డ్రాగన్​ క్యాప్సూల్
  • చిరునవ్వుతో బయటకొచ్చిన ఇండియన్​ ఆస్ట్రోనాట్ ​శుభాంశు శుక్లా
  • సురక్షితంగా భూమిపై కాలుమోపిన నలుగురు వ్యోమగాములు
  • అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు 
  • ఐఎస్ఎస్‌‌కు వెళ్లొచ్చిన మొదటి ఇండియన్​గా ఘనత
  • ప్రధాని మోదీ సహా ప్రముఖుల అభినందనలు
  • శుభాంశు స్వస్థలం లక్నోలో సంబురాలు

న్యూఢిల్లీ: అంతరిక్షంలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇండియన్​ ఆస్ట్రోనాట్​శుభాంశు శుక్లా  భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. యాక్సియం-4 మిషన్‌‌‌‌లో భాగంగా శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములతో ఇంటర్నేషనల్​ స్పేస్​ సెంటర్​ (ఐఎస్ఎస్​)నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ సీ213 'గ్రేస్' క్యాప్సూల్ భూమిపై సేఫ్​గా ల్యాండ్​ అయ్యింది. 

సోమవారం బయలు దేరిన ఈ స్పేస్‌‌‌‌క్రాఫ్ట్ మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో సురక్షితంగా దిగింది. అనంతరం 50 నిమిషాల తర్వాత స్పేస్‌‌‌‌క్రాఫ్ట్​ నుంచి శుభాంశు శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌‌‌‌ ఉజ్నాన్స్‌‌‌‌ కీ-విస్నియెస్కీ, టిబర్‌‌‌‌ కపును స్పేస్​ఎక్స్ టీం బయటకు తీసుకొచ్చారు. శుక్లా చిరునవ్వుతో అభివాదం చేశాడు. సిబ్బంది సహకారంతో మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఇనిషియల్ చెకప్స్​కు వెళ్లాడు.

 ఈ మిషన్​ సక్సెస్‌‌‌‌తో  భారత వైమానిక దళ పైలట్ అయిన గ్రూప్ కెప్టెన్ శుక్లా..1984లో వింగ్ కమాండర్ రాకేశ్​ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా రికార్డు సాధించాడు. అలాగే, ఐఎస్ఎస్​లో గడిపిన మొదటి ఇండియన్‌‌‌‌గా చరిత్ర సృష్టించాడు. ఐఎస్ఎస్‌‌‌‌లో అడుగుపెట్టిన 634వ వ్యోమగామిగా ఘనత పొందాడు.  

కాగా, భూ వాతావరణానికి శరీరాలు అలవాటు పడేందుకు నలుగురు వ్యోమగాములను వారంపాటు రిహాబిలిటేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. వచ్చే నెల 17న కెప్టెన్​ శుభాంశు శుక్లా ఢిల్లీకి బయలుదేరుతారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ తెలిపారు.

యాక్సియం-4 మిషన్‌‌‌‌ సక్సెస్​

స్పేస్​ ఎక్స్​ సంస్థతో కలిసి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేపట్టిన యాక్సియం-–4 మిషన్ సక్సెస్​ అయ్యింది. ఇందులో  భాగంగా ఫాల్కన్- 9 రాకెట్​ను జూన్​ 25న అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ మిషన్​లో శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్‌‌‌‌ ఉజ్నాన్స్‌‌‌‌ కీ-విస్నియొస్కీ, టిబర్‌‌‌‌ కపు పాల్గొన్నారు. భూమి చుట్టూ 28 గంటల ప్రయాణం తర్వాత వ్యోమగాములు బయల్దేరిన స్పేస్​క్రాఫ్ట్​ ఐఎస్ఎస్‌‌‌‌కు డాక్ అయ్యింది. 

శుభాంశు బృందం మొత్తం18 రోజుల పాటు ఐఎస్ఎస్​లో గడిపింది. ఈ క్రూ టీం అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ లాంటి ప్రయోగాలు చేసింది. డయాబెటిక్ నియంత్రణ, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలపై పరిశోధనలు నిర్వహించింది. ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌లో భారరహితస్థితిలో నీటి తీరుతెన్నులను వివరించే ఒక ప్రయోగాన్ని శుక్లా ప్రదర్శించారు. భారత్​ రూపొందించిన ఏడు మైక్రోగ్రావిటీ ప్రయోగాలను  నిర్వహించారు.  

వాటిలో మెంతి విత్తనాల మొలకెత్తడం, స్టెమ్ సెల్ పరిశోధన, మైక్రోఆల్గే అధ్యయనాలు ఉన్నాయి.సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు ఐఎస్ఎస్‌‌‌‌కు అనుసంధానమై ఉన్న డ్రాగన్‌‌‌‌ వ్యోమనౌకలోకి నలుగురు వ్యోమగాములు ప్రవేశించారు.  సాయంత్రం 4.45 గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్‌‌‌‌ గ్రేస్‌‌‌‌ విడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు భూమికి చేరుకుంది.

ప్రధాని అభినందనలు

శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్న శుభాంశును ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సహా పలువురు ప్రముఖులుఅభినందించారు.

లక్నోలో సంబురాలు..

 యాక్సియం-4 మిషన్‌‌‌‌ విజయవంతం కావడంపై దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్లా స్వస్థలమైన లక్నోలో సంబురాలు జరుపుకున్నారు. శుక్లా బంధువులు, మిత్రులు, స్థానికులు కేక్‌‌‌‌ కట్‌‌‌‌ చేసి, సందడి చేశారు.