IND Vs ENG 1st Test: నమ్మకముంచిన వాళ్లే ముంచేశారు..టీమిండియా ఓటమికి ఆ ఇద్దరే కారణం

IND Vs ENG 1st Test: నమ్మకముంచిన వాళ్లే ముంచేశారు..టీమిండియా ఓటమికి ఆ ఇద్దరే కారణం

ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా సొంతగడ్డపై మన జట్టు ఓడిపోవడం షాక్ కు గురి చేస్తుంది. భారత్ లో ఒక విదేశీ జట్టు టెస్టు మ్యాచ్ గెలవడమంటే సాధారణ విషయం కాదు. మొదటి ఇన్నింగ్స్ లో 190 పరుగుల లీడ్ ఉన్నప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లు, బ్యాటర్లు చేతులెత్తేశారు. మొదటగా బౌలింగ్ లో విఫలమైన మనోళ్లు..231 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక చతికిలపడ్డారు. ఈ పరాజయానికి ప్రధాన కారణం ఏంటని పరిశీలిస్తే శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ప్రధమ వరుసలో నిలుస్తారు. 

సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే ఉన్నప్పటికీ జట్టు యాజమాన్యం మాత్రం యువ క్రికెటర్లు గిల్, అయ్యర్ లపై నమ్మకముంచింది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని సెలక్టర్లు అనుభవాన్ని పక్కన పెట్టి వీరిద్దరిని సెలక్ట్ చేశారు. అయితే అయ్యర్, గిల్ మాత్రం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన టెస్టులో దారుణంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్ ల్లో గిల్ 23 పరుగులు చేస్తే.. అయ్యర్ 48 పరుగులు చేశారు. ఈ సిరీస్ కు ముందు జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ లో సైతం అయ్యర్, గిల్ ఘోరంగా విఫలమయ్యారు. 

231 పరుగుల ఛేజింగ్ లో గిల్ డకౌట్ అయితే.. అయ్యర్ 10 పరుగులతో సరిపెట్టుకున్నాడు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగానే భారత్ మ్యాచ్ ఓడిపోయింది అని ఇప్పటికే నెటిజన్స్ మండిపడుతున్నారు. చివరి 10 ఇన్నింగ్స్ లు చూసుకుంటే గిల్, అయ్యర్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం వీరి పేలవ ఫామ్ ను సూచిస్తుంది. నెంబర్ 3, నెంబర్ 5 లో లాంటి కీలక స్థానంలో బ్యాటింగ్ చేసే వీరు ఇలాంటి ప్రదర్శన చేస్తే కెరీర్ డేంజర్ జోన్ లో పడటం ఖాయం. విశాఖ పట్నంలో జరిగే రెండో టెస్ట్ లో వీరు ఆడకపోతే జట్టులో స్థానం కోల్పోవడం పక్కాగా కనిపిస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని వీరు ఎలా ఆడతారో చూడాలి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే  ఇంగ్లాండ్ నిర్ధేశించిన 231 పరుగుల ఛేదనలో 179కే కుప్పకూలి.. 37 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లీష్ స్పిన్నర్ హార్టిలి 7 వికెట్లు తీసుకొని భారత పరాజయానికి కారణమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసిన పోప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం లభించింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న విశాఖపట్నంలో జరుగుతుంది.