IND vs ENG: మీవాడి స్థానం మావాడిదే.. భారత క్రికెటర్ల తండ్రుల సంభాషణపై మీమ్స్

IND vs ENG: మీవాడి స్థానం మావాడిదే.. భారత క్రికెటర్ల తండ్రుల సంభాషణపై మీమ్స్

ఎట్టకేలకు సర్ఫరాజ్‌ ఖాన్‌ కల నెరవేరింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అతడు అరంగ్రేటం చేశాడు. ఇన్నాళ్లు అవకాశాల కోసం ఎదురుచూసి అలసిపోయిన ఈ యువ కెరటం వచ్చిరాగానే ఆ కోపాన్ని ఇంగ్లాండ్ బౌలర్లపై చూపించాడు. ఒక ఎండ్‌లో సహచర క్రికెటర్లు పరుగులు ఆచి తూచి ఆడుతుంటే.. తాను మాత్రం బౌండరీలతో హోరెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ధ శతకం బాది తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న సర్ఫరాజ్‌.. 62 పరుగుల వద్ద జడేజా తప్పిదంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. 

తొలిరోజు ఆట ముగిసిన అనంతరం సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్‌ను శుభ్‌మాన్ గిల్ తండ్రి అభినందించారు. మీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది.. మీ కొడుకు మీ కలను నిజం చేశాడు అంటూ అతన్ని మనసారా హత్తుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నుంచి సర్ఫరాజ్ టెస్ట్ క్యాప్ అందుకున్నప్పుడు అతని తండ్రి నౌషాద్ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే, వీరి సంభాషణపై నెటిజెన్స్ అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

మీవాడి స్థానం మావాడిదే..

'సర్ఫరాజ్ బాగా ఆడాడు.. ఆరంభంలో మావాడు అంతే..', 'ఈమధ్య కాలంలో మీవాడు సరిగా ఆడట్లేదు సర్.. నాలుగు తగిలించకపోయారా..', 'మీవాడు ఇంకో రెండు మ్యాచ్‌ల్లో ఇలానే ఆడితే ఆ స్థానం మావాడిదే..' అని సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మాన్ తండ్రుల మధ్య సంభాషణ జరిగినట్లు లిప్ రీడింగ్ తెలిసినవారిలా నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.