మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువుల షట్టర్ కూల్చివేత

మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువుల షట్టర్ కూల్చివేత

కరీంనగర్: పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువులకు చెందిన షట్టర్ ను అధికారులు కూల్చేశారు. దీనిని గతంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ బంధువులకు అప్పటి అధికారులు కేటాయించారు. రవీందర్ సింగ్ సోదరుడైన బల్బీర్ సింగ్ దుకాణం 20 ఏళ్ల క్రితం రోడ్డు వెడల్పులో పోవడంతో.. అప్పట్లో అద్దె ప్రాతిపదికన గది కేటాయించారు. అయితే ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గదిని కూల్చేశారని రవీందర్ సింగ్ బంధువులు ఆరోపిస్తున్నారు. 20 ఏళ్లుగా మున్సిపల్ అద్దె కూడా చెల్లిస్తున్నామని.. దానికి సంబంధించిన ఆధారాలు చూపించారు. మిగతా స్లాబ్ కూల్చివేయద్దంటూ బల్బీర్ సింగ్ కొడుకు జస్బీర్ సింగ్ గొంతుపై కత్తి పెట్టుకుని నిరసన తెలిపాడు. అయినా కూడా అధికారులు వెనక్కి తగ్గకుండా గదిని కూల్చివేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్  పోటీ చేయడంతో  కక్ష సాధింపులో భాగంగానే షట్టర్ కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఆ షట్టర్ మున్సిపాలిటీ ఆస్తి అయినప్పటికీ.. మున్సిపల్ అధికారులే కూల్చివేయడమేంటని ప్రశ్నించారు. రవీందర్ సింగ్ ను రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి గంగుల ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.