బెంగళూర్: కర్నాటకలో నాయకత్వ మార్పుకు లైన్ క్లియర్ అయ్యింది. హైకమాండ్ ఆదేశాల మేరకు కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం (మే 28) మధ్యాహ్నం బెంగళూర్‌లోని లోక్ భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య రాజీనామా లేఖను సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గ్లెహాట్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీకి రిజైన్ లెటర్ అందజేశారు. సిద్ధూ స్థానంలో కర్నాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదుపరి కర్నాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సీఎం పదవికి రాజీనామా చేసే ముందు గురువారం (మే 28) ఉదయం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు సహచరులకు వెల్లడించారు సిద్ధరామయ్య.
ఏడాది క్రితం నుంచే డీకే వర్గం డిమాండ్..
కర్నాటక కాంగ్రెస్లో ఈ నాయకత్వ సమస్య ఏడాదికిపైగా నలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం రొటేషన్ పద్ధతిలో 2.5 ఏండ్ల తర్వాత సీఎం పదవిని ఇచ్చేలా డీకేకు హామీ ఇచ్చిందని, ఆ వాగ్దానం ప్రకారం.. ఇప్పుడు డీకేకు సీఎం కుర్చీ అప్పగించాలని ఆయన అనుచరులు ఏడాదికిపైగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే, మైనారిటీ వర్గాలు, వెనుకబడిన తరగతులు, దళితులతో కూడిన అహిందా సమూహంలో సిద్ధరామయ్యకు ఉన్న మద్దతు దృష్ట్యా ఆయనను దింపేందుకు కాంగ్రెస్ తటపటాయించింది. సిద్ధూను దింపితే పక్క రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వొక్కలిగ లింగాయత్ వర్గం ఓట్లకు గండిపడుతుందని వాయిదా వేస్తూ వచ్చింది.
ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కూడా ముగిసినందున సీఎం కుర్చీని ఇవ్వాల్సిందేనంటూ డీకే వర్గం మరింత బలంగా డిమాండ్ చేసిందని, దీంతో చివరకు హైకమాండ్ డీకేకు మద్దతు ఇచ్చిందని తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే సిద్ధూను పెద్దల సభకు పంపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే, హైకమాండ్ ఇచ్చిన రాజ్య సభ ఆఫర్ ను సిద్ధరామయ్య తిరస్కరించినట్లు తెలిసింది. తనకు జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని.. కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
ALSO READ : గుజరాత్ లో ఎబోలా అలర్ట్
