బెంగళూర్: కర్నాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో గురువారం (మే 28) రాజీనామా లేఖ అందజేశారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అధిష్ఠానం సూచనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని.. హైకమాండ్ నిర్ణయమే తన నిర్ణయమని స్పష్టం చేశారు.
కిందిస్థాయి నుంచి వచ్చిన తనకు పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. సీఎంగా, ఎల్ఓపీగా పలు బాధ్యతలు అప్పగించిందని గుర్తు చేసుకున్నారు. పల్లెటూరు నుంచి తాను ఎమ్మెల్యే, సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదన్నారు. ఇన్నాళ్లు నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
గవర్నర్ ఊర్లో లేడు..
గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరని.. దీంతో గవర్నర్ కార్యాలయంలో రాజీనామా లేఖ అందజేసినట్లు సిద్ధరామయ్య తెలిపారు. నిబంధనల ప్రకారమే రాజీనామా చేశానని.. గవర్నర్ నా రాజీనామాను ఆమోదిస్తారనుకుంటున్నానని అన్నారు. కాగా, వ్యక్తిగత కారణాలతో ఇండోర్ వెళ్లిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గురువారం (మే 28) రాత్రి 7.30 గంటలకు బెంగళూర్ రానున్నట్లు సమాచారం. దీంతో సిద్ధరామయ్య రాజీనామాపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read : కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
