సిద్దిపేట రూరల్, వెలుగు: వడదెబ్బ తగిలి కుటుంబ పెద్ద మృతి చెందడంతో తాము దిక్కులేని వాళ్లమయ్యామని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతూ సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఓ వృద్ధురాలు కలెక్టర్ కాళ్లు మొక్కేందుకు యత్నించింది. అక్కన్నపేట మండలం దాసు తండాకు చెందిన గుగులోతు రంగా సుతారి మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా, ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ఏప్రిల్ 26న చనిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో అతని భార్య గుగులోతు బుజ్జి సాయం చేయమని కలెక్టర్ కాళ్లు మొక్కేందుకు వెళ్లింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తీసుకు వెళ్లారు. స్పందించిన కలెక్టర్ హైమావతి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
