- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం రంగధాంపల్లిలో ఉన్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ ను, సిద్దిపేట అర్బన్ మండలం కేసీఆర్నగర్ లో ఉన్న బీసీ బాలుర గురుకుల స్కూల్ ను గురువారం కలెక్టర్ సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించి ఆలుగడ్డ, టమాటా కూరలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే ప్రాంగణంలోని ఎంపీపీఎస్ స్కూల్ లో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలిస్తూ మెనూ పాటించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. బస్తీ దవాఖానను సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎం హెచ్ వో ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
రోడ్డు భద్రత కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలి..
రోడ్డు భద్రత కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సీపీ రష్మీ పెరుమాల్ తో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. వంటిమామిడి నుంచి తోటపల్లి వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించి సూచిక బోర్డులు, రంబుల్స్విప్స్, ఐరన్ బారికెడ్స్, బ్లింకర్స్, బస్సు బేలు ఏర్పాటు చేయాలన్నారు. కొమురవెల్లి కమాన్, దుద్దెడలో రోడ్డు మలుపును సరిచేయాలన్నారు. అనంతరం మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
పోలీస్, ఎక్సైజ్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని, ప్రతీ మెడికల్ షాప్ లో అమ్ముతున్న మందుల వివరాలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుశాల్కర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ ధనరాజ్, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్సురేశ్ బాబు, డీఏవో స్వరూపారాణి పాల్గొన్నారు.
