ఎంగిలిపూల బతుకమ్మ ఏర్పాట్లకు వెళ్లి.. చెరువులో మునిగి ముగ్గురు మృతి

ఎంగిలిపూల బతుకమ్మ ఏర్పాట్లకు వెళ్లి.. చెరువులో మునిగి ముగ్గురు మృతి
  •     సిద్దిపేట జిల్లా జగదేవపూర్​మండలం తీగుల్​లో విషాదం
  •     న్యాయం చేయాలని మృతదేహాలతో బంధువుల ఆందోళన

జగదేవపూర్, వెలుగు: ఎంగిలిపూల బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్ల కోసం వెళ్లిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు.. ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందారు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్​మండలం తీగుల్​గ్రామంలో శనివారం జరిగింది. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న గిరిపల్లి భారతి(45), ఎల్లం యాదమ్మ(42), కర్రెమోల్ల బాబు(26), మధు, నాగేశ్​, విజయ తదితరులు.. శనివారం ఎంగిలిపూల బతుకమ్మ నిమజ్జనం కోసం పటేల్ చెరువు వద్ద మెట్లను శుభ్రం చేసేందుకు వెళ్లారు.

కట్ట మెట్లపై చెత్తను తొలగించిన వారు.. కాళ్లూ చేతులు కడుక్కోవడానికి నీటిలోకి దిగారు. ఎల్లం యాదమ్మ మొదలు ప్రమాదవశాత్తు నీట మునిగింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన గిరిపల్లి భారతి,  బాబు, విజయ, నగేశ్​ చెరువులో పడిపోయారు. అక్కడే చెరువు గట్టుమీద ఉన్న మధు అనే వ్యక్తి  చెరువులో దూకి విజయ, నాగేష్ లను కాపాడి గట్టుపైకి తీసుకువచ్చాడు. మిగిలిన ముగ్గురు పూర్తిగా మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భాను ప్రకాశ్​రావు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఈ మేరకు గజ ఈతగాళ్ల సాయంతో మృత దేహాలను బయటికి తీయించారు. భారతి భర్త గతంలో మృతి చెందగా, కొడుకు తీగుల్ సర్కారు బడిలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఎల్లం యాదమ్మ భర్త భూమయ్య పంచాయతీలో హెల్పర్ గా పనిచేస్తూ స్తంభం పైనుంచి పడి ఇంట్లోనే ఉంటుండగా, యాదమ్మ జీపీ కార్మికురాలిగా పనిచేస్తోంది. మరో మృతుడు బాబుకు భార్య స్వప్నతోపాటు ఐదేళ్ల లోపు ఇద్దరు చిన్నారులు శ్రీవర్ధన్, అయాన్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు కార్మికులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కొనసాగుతున్న  ఆందోళన

మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందిస్తారో స్పష్టమైన హామీ ఇస్తేనే పోస్ట్ మార్టంకు తరలిస్తామని వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి హామీ ఇచ్చినా, కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే మృత దేహాలను పోస్ట్ మార్టంకు ఒప్పుకుంటామని వారు స్పష్టం చేశారు.

మృతుల తరఫున నలుగురు వ్యక్తులను గజ్వేల్ కు తీసుకవెళ్లి కలెక్టర్ తో మాట్లడిస్తామనే ప్రతిపాదనను వ్యతిరేకించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చెరువు వద్దనే వాళ్లు మృత దేహాలతో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్​రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండి అందుకుంటామని హామీ ఇచ్చారు.