సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఫోరం సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన ఫోరం 2012 నుంచి పలు కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు.
జిల్లా కోసం సదస్సులు, సమావేశాలు, పాదయాత్రలు, చలో పోస్టాఫీసు కార్యక్రమం, వందలాది ప్రజా సంఘాలు- ప్రతినిధులు ఫాక్స్ ద్వారా వినతులు పంపించడం, సీఎంకు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించారని వివరించారు. జిల్లా ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీగా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సిద్దిపేట కేంద్రం ఆవశ్యకతను వివరించి వినతిపత్రం అందజేశామన్నారు.
జిల్లాల పునర్విభజనపై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణాలో విస్తీర్ణంలో పదకొండవ స్థానంలో ఉన్న సిద్దిపేట జిల్లా అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని దాన్ని రద్దు చేసే ప్రయత్నాలను జిల్లా ఫోరం అడ్డుకుంటుందన్నారు. సమావేశంలో ఫోరం కార్యదర్శి సత్యనారాయణ, జనార్ధన్, నారాయణ, శివ పాల్గొన్నారు.
