
- టెన్త్‌లో సిద్దిపేట సెకండ్
- మూడో స్థానాన్ని నిలబెట్టుకున్న సంగారెడ్డి
- రెండు స్థానాలు తగ్గి 13వ స్థానంలో నిలిచిన మెదక్
- 10 జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులకు రూ. 25 వేలు ఇస్తామని మంత్రి హరీశ్ ప్రకటన
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. నిరుడు స్టేట్ఫస్ట్ప్లేస్లో ఉండగా ఈ సారి ఒక్క స్థానం దిగజారింది. అయితే పాస్ పర్సంటేజీ పెరగడం విశేషం. సంగారెడ్డి జిల్లా గతేడాది 3వ స్థానంలో ఉండగా, ఈ సారి కూడా అదే స్థానం నిలబెట్టుకుంది. మెదక్ జిల్లా నిరుడు కన్నా రెండు స్థానాలు దిగజారింది. గతేడాది 11వ స్థానంలో ఉండగా ఈ సారి 13వ స్థానానికి పడిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాయ్స్కంటే గర్ల్స్ఎక్కువ శాతం మంది పాసయ్యారు.
పాస్ పర్సంటేజీ పెరిగింది..
స్టేట్ ర్యాంకు తగ్గింది...
సిద్దిపేట జిల్లాలో పాస్ పర్సంటేజ్ స్వల్పంగా పెరిగినా రాష్ట్ర స్థాయి ర్యాంకు తగ్గింది. గత ఏడాది 97.85 శాతంతో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన జిల్లా ఈ ఏడాది పాస్ పర్సంటేజీ 98.65 శాతానికి పెరిగినా రెండో ర్యాంకుకు పడిపోయింది. జిల్లాలో మొత్తం 14,177 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాయగా వారిలో 13, 955 మంది (98.65 శాతం) పాసయ్యారు. మొత్తం స్టూడెంట్స్‌లో 7,053 మంది బాయ్స్ పరీక్ష రాయగా వారిలో 6,927 మంది (98.21 శాతం) పాసయ్యారు. గర్ల్స్ 7,124 మంది పరీక్ష రాయగా 7,058 మంది (99.07) పాసయ్యారు. జిల్లాలో ఓవరల్‌గా 126 మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించాయి. జిల్లాలోని 219 ప్రభుత్వ స్కూళ్లు, అక్కన్నపేట, చిన్నకోడూరు, దుల్మిట్ట, కోహెడ, కొండపాక,మద్దూరు, నారాయణరావుపేట, తొగుట మండలాలు వందకు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. టెన్త్ పరీక్షా పలితాల్లో 10/10 జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులకు మంత్రి హరీశ్ రావు రూ. 25 వేలు, వంద శాతం రిజల్ట్ వచ్చిన ప్రభుత్వ స్కూళ్లకు రూ.10 పది వేల నగదు పురస్కారం ప్రకటించారు.
థర్డ్ ప్లేస్ కంటిన్యూ..
టెన్త్ పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 97.29 పాస్ పర్సంటేజీతో రెండో ఏడూ రాష్ట్రంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,358 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా, అందులో 20,780 మంది స్టూడెంట్స్ పాసయ్యారు. బాయ్స్ 10,713 మంది, గర్ల్స్ 10,648 మంది ఎగ్జామ్ రాయగా.. బాయ్స్ 10,367(96.77శాతం) మంది, గర్ల్స్ 10,413 ( 97.82 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
వెనుకబడ్డ మెదక్ జిల్లా
గతేడాదితో పోలిస్తే మెదక్ జిల్లా వెనుకబడింది. 2021–- 22 అకడమిక్ ఇయర్లో 11వ స్థానంలో నిలవగా ఈ సారి 13వ స్థానానికి పడిపోయింది. 2022 -–23లో మొత్తం 10, 680 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా 9,702 మంది (90.84 శాతం) పాసయ్యారు. బాయ్స్ 5,335 మంది పరీక్ష రాయగా 4,695 మంది (88 శాతం), గర్ల్స్ 5,345 మంది పరీక్ష రాయగా 5,007 మంది (93.68 శాతం) పాసయ్యారు. పాపన్నపేట మండలంలో 569 మంది ఎగ్జామ్ రాయగా 548(96 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.