వడ్లకు ఇస్తామన్న బోనస్​ ఏమైంది? : హరీశ్ రావు

వడ్లకు ఇస్తామన్న బోనస్​ ఏమైంది? : హరీశ్ రావు
  • మాట తప్పిన కాంగ్రెస్‌‌ను రైతులు నిలదీయాలి
  • సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు

నిజాంపేట, వెలుగు: కాంగ్రెస్‌‌ వడ్లకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మాట తప్పిన ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.  ఆదివారం నిజాంపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని ఆగం చేసిందని మండిపడ్డారు.  

కరెంట్​ గతంలో మాదిరిగా ఎందుకు రావడం లేదో, నిజాంపేట కాలువకు నీళ్లు ఎందుకు వస్తలేవో కాంగ్రెస్​ ప్రజా ప్రతినిధులు, లీడర్లు సమాధానం చెప్పాలన్నారు. 6 గ్యారంటీలకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైందన్నారు.  100 రోజులు గడిపోయినా మహాలక్ష్మి స్కీమ్‌‌ ద్వారా మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్​ఇవ్వడం లేదని మండిపడ్డారు. సీఎం  రేవంత్ రెడ్డి ఉన్న జిల్లాలను తీసివేస్తారంటా.. మెదక్ జిల్లా, రామయంపేట డివిజన్, నిజాంపేట మండలం పోతే ఊరుకుందామా..? అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే  పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

పెద్దమ్మ ఆలయంలో పూజలు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట రూరల్ మండలం సీతారాం పల్లి, శంకర్ నగర్ లో జరిగిన పెద్దమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవంలో ఆదివారం ఎమ్మెల్యే హరీశ్‌‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం ఎడారిగా ఉండేదని, తెలంగాణ వచ్చాక గోదారిలా మారిందన్నారు. ఇదంతా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం చలవేనన్న స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, నాయకులు పంజా బాలయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.