
- రూ.150 నుంచి
- కొత్తగా యుజీడీ కనెక్షన్లకు రూ.100 చార్జీ
- ఏప్రిల్1 నుంచి పెంచిన చార్జీలు అమలు
సిద్దిపేట, వెలుగు: ఆదాయ వనరుల పెంపులో భాగంగా సిద్దిపేట బల్దియా అధికారులు నల్లా బిల్లులను పెంచారు. కొత్తగా యూజీడీ (అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) కనెక్షన్లు ఉన్న ఇండ్లకు నెలవారీ చార్జీలను విధించారు. ఈ చార్జీలు ఏప్రిల్ నుంచే అప్లై అవుతాయని ప్రకటించారు. దీంతో మున్సిపాలిటీకి నెలకు రూ.75 లక్షల అదనపు ఆదాయం సమకూరనుంది. బల్దియా పరిధిలో మొత్తం 36,136 ఇండ్లు ఉండగా 27,265 నల్లా కనెక్షన్లున్నాయి.
వీటిలో 22 వేలు డొమెస్టిక్, 5265 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. 15 ఎంఎం డయా కనెక్షన్లు ఉన్న నివాస గృహాలకు రూ.150 నుంచి రూ.200, అలాగే 20 నుంచి 32 ఎంఎం డయా పైప్ లైన్లు ఉన్న అపార్ట్మెంట్లకు రూ.1500 నుంచి రూ.2000, వాణిజ్య గృహాలకు రూ.850 నుంచి 1000 రూపాయలకు పెంచారు.
యూజీడీ కనెక్షన్లకు చార్జీలు
సిద్దిపేట మున్సిపాలిటీలో యూజీడీ కనెక్షన్లు ఉన్న ఇండ్ల కు మొదటిసారి చార్జీలను విధించారు. అమృత్ స్కీంలో భాగంగా దశాబ్ద కాలం కింద మున్సిపాలిటీలో రెండు విడతలుగా యూజీడీ పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు 25,890 ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇందులో భాగంగా 3 సీవరేజ్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు రెండింటిని మాత్రమే పూర్తి చేశారు. ఈ రెండు ఏరియాల్లో కనెక్షన్లు పొందిన నివాస, నివాసేతర గృహాల నుంచి నెలవారీగా చార్జీలను వసూలు చేయనున్నారు. నివాస గృహాలకు రూ.100, నివాసేతర గృహాలు, అపార్ట్మెంట్లకు రూ.200, వాణిజ్య సముదాయాలకు రూ.500 చార్జీలను వసూలు చేయనున్నారు. యూజీడీ చార్జీల వసూలుతో నెల వారీగా రూ.25 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి రానుంది.
భారీగా నల్లా బిల్లుల పెండింగ్
మున్సిపాలిటీలో కొంత కాలంగా అధికారులు నల్లా బిల్లుల వసూళ్లపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో దాదాపు రూ.14 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపాలిటీలో 43 వార్డులుండగా బిల్లుల వసూళ్ల కోసం ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్‌ను నియమించారు. వీరు తమకు కేటాయించిన వార్డులోని నివాస, నివాసేతర గృహాల నుంచి రెండు రకాల చార్జీలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీల పెంపు
మంజుల రాజనర్సు, మున్సిపల్ చైర్ పర్సన్, సిద్దిపేట
మున్సిపాలిటీకి ఆదాయ సమీకరణలో భాగంగా తప్పని పరిస్థితుల్లో నెలవారీగా చార్జీలను పెంచాం. యూజీడీ నిర్వహణ మున్సిపాలిటీకి భారంగా మారడం వల్ల నిర్వహణ కోసం చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించాం. మున్సిపల్ ప్రజలకు మెరుగైన విధంగా తాగునీటిని సరఫరా చేయడం కోసం వచ్చిన ఆదాయాన్ని వినియోగిస్తాం.