- అసైన్మెంట్ పరీక్షలకు కొత్త ప్రయోగం
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ పాఠశాలలో క్యూ ఆర్ కోడ్‌తో పరీక్షలను నిర్వహిస్తున్నారు. స్కూల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన హైటెక్ హాల్ టికెట్లను రూపొందించారు. మంగళవారం నుంచి ప్రారంభమైన అసైన్మెంట్ పరీక్షల కోసం విద్యార్థులకు ఈ డిజిటల్ హాల్ టికెట్లను అందజేశారు.
స్కాన్ చేస్తే వివరాలు..
విద్యార్థులకు ఇచ్చిన హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. పరీక్షా గదిలో ఇన్విజిలేటర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి, సెక్షన్, హాల్ టికెట్ నంబర్ వంటి వివరాలన్నీ క్షణాల్లో మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
హెచ్ఎం అనుముల కరుణాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షల విభాగం ఇన్చార్జి చిలక వెంకటయ్య ఆధ్వర్యంలో సోషల్ టీచర్ రంజిత్ కుమార్ ఈ హాల్ టికెట్లను రూపొందించారు. గ్రామీణ విద్యార్థులకు టెక్నాలజీని పరిచయం చేసేందుకే ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు హెచ్ఎం తెలిపారు.
