తెలంగాణ లో సిద్దిపేట రైలు కల నెరవేరింది!

తెలంగాణ లో సిద్దిపేట రైలు కల నెరవేరింది!

ఆరు దశాబ్దాల సిద్దిపేటకు రైలు కల నేడు నెరవేరనుంది. సిద్దిపేట జిల్లా వాసులు సొంత భూమి నుంచి రైలు ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది. అది దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల. రైలు అనే మాట వినని ఈ ప్రాంత ప్రజలు, అది సాకారమైన తరుణంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఉన్న చాలా మందికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ – కరీంనగర్ జిల్లా   కొత్తపల్లి రహదారిలో కీలక మైలురాయి మంగళవారం ప్రారంభం కానుంది. 

సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్ పుల్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ నుంచి వర్చువల్ జర్నీ ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. తాజాగా ఈ మార్గంలో రెండు రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. మనోహరాబాద్- కొత్తపల్లి మార్గం నాలుగు జిల్లాలను కలిపే ముఖ్యమైన మార్గం. ఇక తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్నను ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. అయితే, ఈ పుణ్యక్షేత్రానికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేక భక్తులు తిప్పలు పడుతున్నారు. 

రాజీవ్‌‌‌‌ రహదారి నుంచి 3 కి.మీ. దూరం ఉన్న క్షేత్రానికి చేరుకోవడానికి, తిరిగి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు మార్గంలో హైదరాబాద్‌‌‌‌ నుంచి సుమారు 110 కి.మీ., కరీంనగర్‌‌‌‌ నుంచి 90 కి.మీ., ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రైల్వే లైన్‌‌‌‌తో పాటు స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులకు సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా కానున్నాయి.ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువులు రైలు ద్వారానే వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ధాన్యం క్రమం తప్పకుండా ఎగుమతి అవుతోంది. సిద్దిపేటలో కూడా సరుకు రవాణా ప్రాంగణం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

- ఆలేటి రమేశ్