
సిద్దిపేట రూరల్, వెలుగు: అన్ని జాతీయ స్థాయి ఆటలకు వేదికగా సిద్దిపేట మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 16 రకాల క్రీడలకు సంబంధించిన మైదానాలు, కోర్టులు, సౌకర్యాలను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం వల్ల అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు అతిథ్యం ఇస్తోందన్నారు.
గురువారం సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియంలో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట క్రీడా కారులు ఆటల్లో అగ్రగామిగా నిలవాలన్నారు. సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం అద్భుతంగా చేసుకున్నామని, జాతీయ స్థాయిలో ఎదగాలని సూచించారు.
సిద్దిపేట క్రీడా కాంప్లెక్స్ ను మరో రూ.11కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు, క్రికెట్ స్టేడియాన్ని రూ.4 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల జాతీయ స్థాయిలో ఎంపికైన అబ్దుల్ సమద్ ను, రాష్ట్ర స్థాయి లో ఎంపిక అయిన శివ గణేశ్‌ను అభిందించారు. అనంతరం పట్టణంలో ఫెడరల్ బ్యాంక్ ను ప్రారంభించారు.