వర్గల్ మండలం నాచారంలో..డబ్బులు కావాలని బెదిరించడంతో హత్య

వర్గల్ మండలం నాచారంలో..డబ్బులు కావాలని బెదిరించడంతో హత్య
  • మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ 

గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం వివరాలను గజ్వేల్ ఏసీపీ కె. నరసింహులు మీడియాకు వెల్లడించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన భదనపురం పెంటయ్య(30) డ్రైవర్. గతంలో చోరీల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నెల కింద చేగుంటలోని కల్లు డిపో వద్ద ఇస్లాంపూర్‌కు చెందిన మంతూర్ కల్పనతో అతనికి పరిచయమైంది. 

అప్పటి నుంచి వీరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటుండేవారు. గత డిసెంబరు 31న సాయంత్రం పెంటయ్యకు కల్పన ఫోన్ చేసి దావత్ చేసుకుందామని పిలిచింది. దీంతో బిర్యానీ, మద్యం కొని తీసుకుని వెహికల్ లో నాచారం శివారులోని బ్రిడ్జి వద్దకు వెళ్లి తిని తాగారు. అనంతరం కల్పన రూ. 10 వేలు కావాలని డిమాండ్ చేసింది. అంత డబ్బు లేదని అతడు చెప్పగా రేప్, చీటింగ్ కేసులు పెడతానని బెదిరించింది. 

మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో పెంటయ్య వెహికల్ లోని తాడుతో ఆమె మెడకు చుట్టి హత్య చేశాడు. డెడ్ బాడీని  నాచారం వద్ద  సిరి సీడ్స్ కంపెనీ సమీపంలో పడేశాడు. ఆమె సెల్ ఫోన్‌ను గజ్వేల్ శివారులో ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. ఈనెల1న మహిళ డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి రెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి లారీని, తాడు,  ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు. కేసును ఛేదించిన గజ్వేల్ రూరల్ సీఐ పి. మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.