
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్ శుభ్ దీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారి, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ బ్రార్‌ను అమెరికాలో పోలీసులు అరెస్టు చేశారు. 2017 నుంచి కెనడాలో ఉన్న గోల్డీ.. ఇటీవలే అమెరికాకు మకాం మార్చాడని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కిందటి నెల 20వ తేదీన కాలిఫోర్నియాలో ఆ గ్యాంగ్ స్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపాయి. అయితే అతని పట్టివేత గురించి ఇండియన్ గవర్నమెంట్‌కు అధికారికంగా ఇంకా వెల్లడించలేదని పేర్కొన్నాయి. సింగర్ సిద్ధూ మూసేవాలా(28) ఈ ఏడాది మే నెలలో పంజాబ్ లో మాన్సా జిల్లాలోని ఓ గ్రామంలో హత్యకు గురయ్యారు.
ప్రభుత్వం సిద్ధూకు సెక్యూరిటీని తగ్గించిన కొద్ది రోజులకే ఈ హత్య జరిగింది. ఈ హత్యకు ప్లానింగ్ తనదేనని గోల్డీ బ్రార్.. ఫేస్ బుక్ పోస్టులో ప్రకటించుకున్నాడు. యూత్ అకాలీ లీడర్ వికీ మిద్దూఖేరా హత్యకు ప్రతీకారంగానే సిద్ధూను చంపించినట్లు అతడు చెప్పుకున్నాడు. కాగా, తీవ్రమైన ఒత్తిడితోనే గోల్డీ అమెరికాకు మకాం మార్చినట్లు సమాచారం. అక్కడ ముందుగా ఫ్రెన్స్ కో సిటీలో కొద్ది రోజులు ఉన్నాడు. ఆ తర్వాత తన గుర్తింపు బయట పడకుండా ఉండేందుకు సాక్రమెంటో, ఫ్రిజోవ్, సాల్ట్ లేక్ వంటి సిటీలకు మారాడు.
గోల్డీ నిర్బంధం గురించి ఇండియా గూఢచార సంస్థ రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), ఢిల్లీ, పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కు సమాచారం వచ్చిందని తెలుస్తోంది. మరోవైపు, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా గోల్డీ నిర్బంధాన్ని కన్ఫర్మ్ చేశారు. అతడిని త్వరలోనే పంజాబ్ తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, తన కొడుకు హత్య కేసులో మాస్టర్ మైండ్ గోల్డీ బ్రార్ అమెరికాలో పట్టుబడినట్లు తెలిసి మూసేవాలా తండ్రి బాల్ కౌర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.