ఆ ఊరుని చూస్తే ఇంద్రధనుస్సులా..

ఆ ఊరుని చూస్తే ఇంద్రధనుస్సులా..

ఏడు రంగులున్న ఇంద్రధనుస్సు ఎంత అందంగా ఉంటుందో...  రెండే రంగులున్న ఈ ఊరూ అంతే అందంగా ఉంటుంది. రంగురంగుల మేడలు కనిపిస్తున్న ఈ ప్రపంచంలో తెలుపు, నీలం రంగుల భవనాలు మాత్రమే కనిపించే ఒక ఊరుంది. గోడలన్నీ తెలుపు రంగుతో ఉండి... చెక్క, రాగి, ఇనుప తలుపులు నీలం రంగులో ఉంటాయి. సముద్రానికి దగ్గరగా, కొండ పైన మల్లెపూల తోటలా ఉంటుంది. బయట వైపు కనిపించే రెండు రంగులు మనసుకు హాయినిస్తే... లోపలికెళ్లి చూస్తే రంగురంగుల అరబిక్ డిజైన్స్​ కళ్లను కట్టిపడేస్తాయి. ఇంద్రభవనాల్లాంటి ప్యాలెస్​లు, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, ట్రెడిషనల్ ఫుడ్ ఇలా అక్కడ కనిపించేవన్నీ చాలా స్పెషల్​. అన్నింటికీ మించి ఆర్టిస్ట్​లకు అండగా, ఇన్​స్పిరేషన్​గా నిలుస్తున్న ఊరు ఇది.  

పేరు ‘సిడి బౌ సెడ్’.ట్యునీషియాలోని ఒక ఊరు సిడి బౌ సెడ్. కార్తెజ్, గల్ఫ్ ఆఫ్ ట్యునిస్​కు పైన ఉంది ఈ సిటీ. ఇది మధ్యధరా సముద్రానికి పై వైపున ఉన్న కొండ ప్రాంతంలో ఉంది. దాదాపు ఆరువేల మంది జనాభా ఉంటారిక్కడ. తెలుపు గోడలు, నీలం తలుపులతో అందంగా, ప్రశాంతంగా కనిపించే ఈ ఊరు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్​లలో ఒకటి. ఈ ఊరి వాళ్లు అరబిక్, ఫ్రెంచ్ మాట్లాడతారు. ఇక్కడి కరెన్సీ ట్యునీషియన్ దినార్.

ట్యునీషియా రాజధాని నుంచి సిడి బౌ సెడ్​కు గంట ప్రయాణం. వెళ్లే దారంతా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. చుట్టూ కొండలు, చెట్ల పచ్చదనంతో అందంగా ఉంటుంది. సిటీలోకి ఎంటర్​ అయ్యాక తెలుపు, నీలం రంగు భవనాలు కనిపిస్తాయి. ఆ ఇరుకు సందుల్లో విరబూసిన పూల చెట్లు వెల్​కమ్​ చెప్తాయి. బోగన్ విల్లియా పూల చెట్లు కూడా వాళ్ల ట్రెడిషన్​లో భాగమే. అందుకే వీధుల్లో ఎక్కువగా ఈ చెట్లే కనిపిస్తాయి. 

ట్రెడిషనల్ టేస్ట్

కబ్కబౌ, స్పానిష్​ టార్టిల్లా, మెక్యుయా సలాడ్లు తింటారు.ఇంకా మెడిటేరియన్ కుజిన్, శ్నాక్స్​, కాక్​టైల్స్, ఇటాలియన్ డిషెస్​, ‘బంబలౌనీ’ అనే రింగ్ షేప్​లో ఉండే పెద్ద డోనట్, పుదీనా, పైన్​ నట్ టీ టేస్ట్ చేయొచ్చు. అగ్రికల్చర్​కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గోధుమలు, బార్లీ ఎక్కువగా పండిస్తారు. గొర్రెల పెంపకం కూడా చేస్తారు. 

సూఫీ కట్టిన ఊరు

అబు సెడ్ ఎల్ బజి అనే సూఫీ టీచర్1207లో ఈ ప్రాంతానికి వచ్చాడు. అక్కడి ప్రజలకు సూఫీని పరిచయం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. చరిత్రకారుల ప్రకారం, అబు సెడ్ ఇన్బ్ కలాఫ్ యహ్యా అల్ బెజి (అబు సెడ్ ఎల్ బజి) ఈ ప్రాంతానికొచ్చాడు. అప్పట్లో ఈ ఊరిని ‘జబల్ ఎల్ మెనార్’ అని పిలిచేవాళ్లు. అబు ఇక్కడికి వచ్చి ఒక శాంక్చురీ స్థాపించాడు.1231లో ఆయన చనిపోయాడు. ఆయన గుర్తుగా ‘జవియా’ అనే ఇస్లామిక్ రిలీజియస్ స్కూల్, అందులోనే ఒక మసీదును కూడా కట్టారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ ఊరిపేరు ‘సిడి బౌ సెడ్’గా మారింది. ఈయన సమాధిని దర్శించడానికి ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు.18వ శతాబ్దంలో హుసైనిద్ రాజవంశం వారు ఇక్కడికి వచ్చారు. వాళ్లతోపాటు ఎంతోమంది మ్యుజీషియన్స్​ను, రైటర్స్​ని తీసుకొచ్చారు. అందువల్లే దీనికి ‘ఆర్టిస్ట్స్​ విలేజ్​’ అనే పేరొచ్చింది. ఆ తర్వాత కొద్దికాలంలోనే ఇంటర్నేషనల్​గా ‘హంట్ ఆఫ్ ఆర్టిస్ట్స్’ అని పాపులర్​ అయింది. ఫ్రెంచ్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌, మ్యూజికాలజిస్ట్ అయిన బ్యారన్ రొడాల్ఫ్​ డి ఎర్లాంగర్​ అరబ్​ మ్యూజిక్​ మీద బుక్స్​ రాశాడు. ఈయనకు ఆ ఊరంటే చాలా ఇష్టం. అందుకే 1915లో ఆ ఊరి కల్చర్​ ఎప్పటికీ అలాగే ఉండేలా చట్టబద్ధంగా రక్షణ కల్పించాడు. 

ప్యాలెస్​లు మ్యూజియాలుగా..

ఈ ఊళ్లో అందమైన కట్టడాలు చాలా ఉన్నాయి. వాటిలో రొడాల్ఫ్​ కోసం 20వ శతాబ్దంలో కట్టించిన ప్యాలెస్ ‘దర్ నెజ్మా ఎజ్జరా’ ఒకటి. ఇది చాలా అందంగా ఉండేది. ఈ ప్యాలెస్ కూడా ఈ ఊరికి ఒక లాండ్ మార్క్​​. కానీ, ఇప్పుడు దీన్ని మ్యూజియం చేశారు. ఈ ప్యాలెస్​ను ఇద్దరు ట్యునీషియన్​లు, ఎనిమిది మంది మొరాకన్​లు కలిసి సీలింగ్, బాల్కనీలు, గోడల్ని మార్బుల్స్​తో కట్టేందుకు పదేండ్లు పట్టిందట. నిజానికి ప్యాలెస్ బయట కంటే లోపల చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే బయటి వైపు కనిపించేవి రెండే రంగులు. కానీ, లోపలికి వెళ్లి చూస్తే రంగురంగులతో కళ్లు చెదిరే ట్రెడిషనల్ ట్యునీషియా ఆర్కిటెక్చర్​ డిజైన్స్​ కనిపిస్తాయి. ఇందులో ఈయన దగ్గరున్న మ్యూజికల్ ఇను​స్ట్రుమెంట్స్​తో పాటు పెయింటింగ్స్​ కూడా చూడొచ్చు. ఇది అరబ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్​కి చక్కటి ఉదాహరణ. క్లాసికల్, అరబిక్ మ్యూజిక్ కాన్సర్ట్​లు కూడా జరుగుతాయి. దీన్ని ఎన్నెజ్మా ఎజరా అని కూడా అంటారు. ట్యునీషియాకు స్వాతంత్ర్యం వచ్చాక ఆ దేశంలో మొదట తెరిచింది ఈ మ్యూజియాన్నే. 

సినిమాలో ప్యాలెస్

ఈ ఊళ్లో అన్నీ తెలుపు, నీలం రంగులో ఉండటానికి కారణాలు చాలా చెప్తారు. ఎక్కువ మంది చెప్పేదేంటంటే... బ్యారన్, ప్యాలెస్​ కట్టిన రంగులు చూసి ఇన్ స్పైర్​ అయ్యి అందరూ అలాగే ఫాలో అయ్యారు అని. దీన్ని సినిమా లొకేషన్స్​ కోసం కూడా వాడుకోవచ్చు. లారెన్స్​ డురెల్స్​ బ్రిటిష్ రైటర్ రాసిన నవల ఆధారంగా ‘జస్టిన్’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఈ ప్యాలెస్ కనిపిస్తుంది. ‘దర్ ఎల్ అన్నబి’ అనే మ్యూజియాన్ని కూడా ట్రెడిషనల్ స్టైల్​లోనే కట్టారు. అందువల్ల ఇక్కడికొచ్చే టూరిస్ట్​లు ఆ ఊరి కల్చర్​ను అక్కడ చూడొచ్చు. వాటిలో కొన్ని రూమ్​లు లోకల్ లైఫ్​ స్టైల్​ను గుర్తుచేస్తాయి. దీన్ని18వ శతాబ్దంలో కట్టారు. 20వ శతాబ్దంలో సమ్మర్​ రిసార్ట్​లాగ డెవలప్ చేశారు. ఇంటీరియర్ మొత్తం రంగురంగుల సెరామిక్ టైల్స్​తో, గ్లాస్​లతో అందంగా ఉంటాయి. లోపలికెళ్తే ప్రైవేట్ లైబ్రరీ, ప్రేయర్ హాల్, వరండాలు, బెడ్ రూమ్స్, అండలూసియన్ గార్డెన్స్​ ఉన్నాయి. మ్యూజియం చూడటానికి ఫీజు కట్టాలి. అక్కడ ఈవెంట్ చేయాలనుకుంటే రెంట్ కట్టాలి. కట్టిన రెంట్​కు కావాల్సినంత ప్లేస్​కి పర్మిషన్ ఇస్తారు. 

ఆర్ట్ గ్యాలరీలు

పెయింటర్స్​ కోసం చిన్న చిన్న ఆర్ట్​ గ్యాలరీలు ఉంటాయి. వాటిలో ఘయా, గోర్జీ అనే రెండు గ్యాలరీలు ఫేమస్. ఎందుకంటే ఆ గ్యాలరీల్లో లోకల్ ఆర్టిస్ట్​లు షెడ్యూల్​ ప్రకారం ఎగ్జిబిషన్స్​ పెట్టుకోవచ్చన్నమాట. 

ఎందరికో ఆదర్శం

ఈ ఊరు చాలామంది ఆర్టిస్ట్​లకు ఇన్​స్పిరేషన్. పాల్ క్లీ, గుస్తవ్ హెన్రి జోసట్, అగస్ట్ మాకె అనే ఆర్టిస్టులు1914లో ఇక్కడికొచ్చారు. అదే సంవత్సరం ఆర్టిస్ట్ మాకె, సిడి బౌ సెడ్ ఊరి పాత ఫొటోల్లో ఒకదాన్ని పెయింటింగ్ వేశాడు. పాల్​ క్లీ అనే ఆర్టిస్ట్ మొదట బ్రౌన్​, బ్లాక్ కలర్స్​తో ఆర్ట్ వేసేవాడు. ఎప్పుడైతే ఈ ఊరికి వచ్చాడో, అప్పటి నుంచి లైట్ కలర్స్​తో పెయింటింగ్స్ వేసేవాడట. అంతేకాదు, గ్రాఫిక్స్​ కూడా చేసేవాడట. వీళ్లే కాకుండా ఫ్రెంచ్ ఫిలాసఫర్ మైఖేల్ ఫాకల్ట్, ఫేమస్​ ఆక్కలిస్ట్‌‌‌‌‌‌‌‌ అలీస్టర్ క్రౌలీ కూడా ఇక్కడ నివసించారు. 

హోటల్స్

ఇక్కడ ఎక్కువ హోటల్స్​ ఉండవు. కానీ, ‘హోటల్ దార్ సెడ్’ అనేది పాపులర్. వాళ్ల భాషలో ‘దార్’ అంటే ఇల్లు అని అర్థం. ఈ హోటల్ కూడా తెలుపు, నీలం రంగులతో కట్టిందే. రూం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ ఊళ్లో వాళ్ల కంటే టూరిస్ట్​లే ఎక్కువగా కనిపిస్తుంటారు. దీనికి దగ్గర్లో ఉన్న ఊళ్లలో కూడా స్టే చేసి, ఇక్కడికి వస్తుంటారు టూరిస్ట్​లు.