
- టీఎస్పీఎస్సీపేపర్ల లీకేజీపై గప్ చుప్
- నిరుద్యోగుల సమస్యలు గాలికి
- భరోసా ఇవ్వని సర్కారు.. పోరాటం ఆపిన ప్రతిపక్షాలు
- దోషులెవరో తేల్చని సిట్
- విచారణను సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వం నో
- ప్రక్షాళన లేకుండా పాత బోర్డుతోనే పరీక్షల నిర్వహణ
- బోర్డుపై నమ్మకం కోల్పోయిన నిరుద్యోగులు
- ఏఈఈ ఎగ్జామ్స్‌కు సగం మందే హాజరు
- వెలవెలబోతున్న లైబ్రరీలు, ప్రిపరేషన్ సెంటర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. వారికి భరోసా ఇవ్వాల్సిన పాలకపక్షం బీఆర్ఎస్.. ఆ మాటే ఎత్తడం లేదు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై నిరుద్యోగుల తరఫున ఇన్నాళ్లూ పోరాడిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. ఒకరో ఇద్దరో నాయకులు తప్ప మిగతా ఎవరూ మాట్లాడ్తలేరు. లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత బోర్డు ఆధ్వర్యంలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు ఆ ఎగ్జామ్స్ రాసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూప్తలేరు. ఏఈఈ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న వాళ్లలో సగం మంది మాత్రమే అటెండ్ కావడం ఇందుకు నిదర్శనం. గతంలో నిర్వహించిన ఏఈఈ పరీక్షలకు 75 శాతానికి పైగా అభ్యర్థులు హాజరు కాగా సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పరీక్షలకు 51 శాతం మందే అటెండ్ అయ్యారు.
ఈసారి పేపర్లు లీక్కావన్న నమ్మకాన్ని, పకడ్బందీగా కండక్ట్ చేస్తామన్న భరోసాను ప్రభుత్వం కానీ, టీఎస్పీఎస్సీ కానీ కల్పించలేకపోతున్నాయి. దీంతో చాలా మంది నిరుద్యోగులు ప్రిపరేషన్‌ను పక్కనపెట్టేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు కిటకిటలాడిన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్‌నగర్‌లోని స్టడీ హాల్స్ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 88 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజు నుంచి నిరుద్యోగులు జాబ్స్ కోసం గట్టిగా ప్రిపరేషన్చేపట్టారు. టీఎస్పీఎస్సీ, పోలీస్రిక్రూట్మెంట్, గురుకుల రిక్రూట్మెంట్, మెడికల్అండ్హెల్త్రిక్రూట్మెంట్బోర్డులు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాయి. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌చేసుకున్నారు. వారంతా తమకు అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకున్నారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఏఈ, గ్రూప్– 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు నిర్వహించింది. పేపర్లు లీక్కావడంతో ఈ పరీక్షలన్నీ రద్దయ్యాయి. ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన హార్టికల్చర్ఆఫీసర్, అసిస్టెంట్మోటార్వెహికల్ఇన్ స్పెక్టర్, అగ్రికల్చర్ఆఫీసర్, గ్రౌండ్వాటర్గెజిటెడ్, నాన్గెజిటెడ్ఆఫీసర్పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది.
రెండు నెలలు గడిచినా పేపర్ల లీకేజీపై సిట్పెద్దగా తేల్చిందేమీ లేదు. దీనిపై సీబీఐతో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు డిమాండ్ చేసినా.. ధర్నాలు చేసినా.. ప్రభుత్వం ససేమిరా అంటున్నది. పేపర్ల లీకేజీ కింది స్థాయి ఉద్యోగులకే పరిమితమైన అంశం కాదని, బోర్డు పెద్దలకు కూడా దీనిలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. యువత నుంచి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. పేపర్ల లీకేజీల వెనుక ఇద్దరు మాత్రమే ఉన్నారని అప్పట్లో మంత్రి కేటీఆర్కామెంట్చేయడం విమర్శలకు దారితీసింది.
అంత జరిగినా మళ్లా పాత బోర్డుతోనే..!
టీఎస్పీఎస్సీ బోర్డులో ఎలాంటి మార్పులు చేయకుండానే ప్రభుత్వం పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది. బోర్డులో ఎలాంటి ప్రక్షాళన లేకుండా.. కొత్తగా ఒక ఐఏఎస్అధికారిని కంట్రోలర్ఆఫ్ ఎగ్జామినేషన్స్హోదాలో నియమించి పరీక్షల స్టార్ట్చేశారు. మే, జూన్ నెలల్లో పలు పరీక్షలు నిర్వహిస్తామని ఇదివరకే షెడ్యూల్ప్రకటించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్జూన్ 11న నిర్వహించనున్నారు. రద్దు చేసిన పరీక్షల్లో ఏఈఈ (ఎలక్ట్రికల్అండ్ ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్ఇంజనీర్) పరీక్షలను సోమ, మంగళవారాల్లో చేపట్టారు. జనవరి 22న ఇదే పరీక్ష నిర్వహించగా 75 శాతానికిపైగా అభ్యర్థులు హాజరుకాగా.. ఇప్పుడు 51 శాతం నుంచి 55 శాతం మంది మాత్రమే అటెండ్అయ్యారు. పాత బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించడంతో, దానిపై నమ్మకం లేక అభ్యర్థులు పెద్దగా హాజరుకాలేదని నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. గతంలో పేపర్లు లీకైనా ఈసారి నిర్వహించే పరీక్ష పేపర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్కావు అనే భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ విఫలమైందని మండిపడుతున్నారు. పలు పరీక్షలను రానున్న 50 రోజుల్లోనే నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకటించినా.. వాటి కోసం ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య కూడా భారీగా తగ్గింది.
స్పందించని సీఎం..
ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్‌నగర్‌లోని పలు కోచింగ్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. రెండేండ్లుగా కిటకిటలాడిన అశోక్‌నగర్ స్టడీ హాల్స్‌లో కూడా ఎవరూ కనిపించడం లేదు. సర్కారు కొలువు సాధించడమే ధ్యేయంగా ఏండ్లకేండ్లు ప్రిపేర్అయిన వాళ్లు సైతం పరీక్షల నిర్వహణపై నమ్మకం లేక తమ గ్రామాలకు వెళ్లిపోయారు. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావుండదని ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఆ వైపు ఆలోచించడం లేదు. సీఎం కేసీఆర్ఇప్పటి వరకు పేపర్ల లీకేజీలపై కనీసం స్పందించలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్సహా ఇతర కీలక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఎవరూ సందేహాలు పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు.
ఉధృతంగా పోరాడి..
టీఎస్పీఎస్సీ పేపర్లు లీకైన మొదట్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ, టీజేఎస్సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు యువతకు మద్దతుగా ఆందోళనలు చేశాయి. నిరుద్యోగ దీక్షలు, రౌండ్‌టేబుల్ సమావేశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాయి. పేపర్ల లీకేజీలతో బోర్డు చైర్మన్‌కు సంబంధం లేదని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. చైర్మన్ ఆధీనంలోనే పేపర్లు ఉంటాయని ఆధారాలతోపాటు ప్రతిపక్షాలు బయట పెట్టాయి. న్యాయపోరాటం చేయడంతో పాటు జిల్లాల్లోనూ ఉద్యమాలు సాగించాయి. కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై క్రమేణా సైడ్ అవుతున్నాయి. కొందరు నాయకులు మాత్రమే అప్పుడప్పుడు ఈ అంశంపై స్పందిస్తున్నారు.