
దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ( SIIMA 2025 ) కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. దక్షిణాది సినీ నటీనటులతో ఈ ప్రాంగణం అంతా కలకలలాడింది. తారలు డ్యాన్స్ లు, స్టెప్పులతో మార్మోగింది. సైమా అవార్డ్స్ లో తెలుగు సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.. ముఖ్యంగా అగ్ర చిత్రాలైన 'పుష్ప 2: ది రూల్' , 'కల్కి 2898 AD' చిత్రాలకు అవార్డుల పంట పండింది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుక మొదటి రోజు తెలుగు , కన్నడ సినీ పరిశ్రమల్లోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందించి సత్కరించింది..
'పుష్ప 2', 'కల్కి' చిత్రాలకు పురస్కారాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా పురస్కారాన్ని కైవసం చేసుకుని తన స్టార్‌డమ్‌ని మరోసారి నిరూపించుకున్నారు. ఇ ఇదే చిత్రంలో శ్రీవల్లిగా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రష్మిక మందన్న ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. ఈ చిత్రానికి ప్రాణం పోసిన దర్శకుడు సుకుమార్ కూడా ఉత్తమ దర్శకుడిగా SIIMA అవార్డు గెలుచుకున్నారు. దీంతో 'పుష్ప 2' చిత్రానికి మూడు కీలక అవార్డులు దక్కాయి.
మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఉత్తమ విలన్‌గా అవార్డు కైవసం చేసుకున్నారు. అలాగే, కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, అన్నా బెన్ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు గెలుచుకున్నారు.
తేజ సజ్జకు అవార్డు..
క్రిటిక్స్ విభాగంలో కూడా ప్రతిభావంతులకు గుర్తింపు లభించింది. చిన్ని సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన నటుడు తేజ సజ్జ.. 'హనుమాన్' చిత్రానికి గాను ఉత్తమ నటుడు (క్రిటిక్స్) అవార్డు సొంతం చేసుకున్నారు. అదే చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) అవార్డు గెలుచుకున్నారు. 'లక్కీ భాస్కర్' చిత్రంలో అద్భుతమైన నటనకు మీనాక్షి చౌదరికి ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు వరించింది.
సాంకేతిక విభాగంలో 'దేవర' చిత్రానికి రత్నవేలు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డు పొందారు. 'పుష్ప 2' చిత్రానికి అద్భుతమైన మాస్ బీట్స్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. 'దేవర'లోని 'చుట్టామల్లే' పాట రచయిత రామజోగయ్య శాస్త్రికి ఉత్తమ గీత రచయిత పురస్కారం లభించింది. అలాగే, ఈ పాటను ఆలపించిన శిల్పా రావు ఉత్తమ గాయనిగా అవార్డు పొందారు. 'పుష్ప 2' లోని 'ఫీలింగ్స్' పాటకు గాయకుడు కందుకూరి శంకర్ బాబు ఉత్తమ గాయకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.
కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు
కన్నడ పరిశ్రమలో కూడా పలువురు ప్రతిభావంతులు అవార్డులను సొంతం చేసుకున్నారు. వారిని సైమా ఘనంగా సత్కరించింది. 'గౌరి' చిత్రంలో అద్భుతంగా నటించిన సమర్జిత్ లంకేష్ ఉత్తమ నూతన నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. B అజనీష్ లోక్‌నాథ్ 'మాక్స్' చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డు వరించింది..
మలయాళం , తమిళ చిత్రాలకు సంబంధించిన SIIMA అవార్డుల విజేతలను శనివారం ప్రకటించనున్నారు. ఇప్పటికే మలయాళ చిత్రం 'ది గోట్ లైఫ్' పది నామినేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, 'ARM' తొమ్మిది,'ఆవేశం' ఎనిమిది నామినేషన్లతో ముందున్నాయి. ఈ రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సైమా అవార్డ్స్ వేడుక సినీ అభిమానులకు ఒక గొప్ప పండుగలా అలరిస్తోంది.