లోక్​సభ ఎన్నికల వేళ..మణిపూర్​లో మౌనం

లోక్​సభ ఎన్నికల వేళ..మణిపూర్​లో మౌనం
  •    అల్లర్ల కారణంగా కనిపించని ర్యాలీలు
  •     పార్టీ ఆఫీసులు, అభ్యర్థుల ఇండ్ల ముందే సభలు
  •     కార్యకర్తల ఇంటింటి ప్రచారం
  •     రెండే సీట్లు.. అయినా రెండు దశల్లో పోలింగ్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే.. మణిపూర్ మాత్రం మూగబోయింది. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ లోక్​సభ స్థానాలకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్చి 16న షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 19న ఇన్నర్ మణిపూర్, 26న ఔటర్ మణిపూర్ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, గతేడాది మే 3న చెలరేగిన అల్లర్ల కారణంగా ప్రజలందరూ తమ ఇండ్లు వదిలిపెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు దగ్గర్లోని అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయారు. 

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణ ఈసీకి సవాల్ గా మారింది. క్యాంపుల్లో, అటవీ ప్రాంతాల్లో ఉంటున్నవారితో ఓటు వేయించడం కష్టంగా మారనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాకపోయినప్పటికీ.. పోలింగ్ రోజు ఏమవుతుందో అన్న టెన్షన్ ఈసీ అధికారుల్లో ఉన్నది. శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి 162 కంపెనీల (14,600 మంది) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్​(సీఏపీఎఫ్)ను కేంద్రం మోహరించింది.

మణిపూర్​వైపు చూడని నేతలు

పోలింగ్‌‌కు ఇంకా 2 వారాల సమయం మాత్రమే ఉంది. అయినా, ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. ఎక్కడా ర్యాలీలు, సభలు, కనీసం పోస్టర్లు కూడా కనిపించడం లేదు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలంటూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన హోర్డింగులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రచారానికి జాతీయ నేతలెవరూ వెళ్లట్లేదు. ఏ పార్టీ రిస్క్ తీసుకోవడం లేదు. మైతీలు ఉండే లోయ ప్రాంతాలతో పాటు కుకీలు ఉండే కొండ ప్రాంతాలన్నీ మూగబోయాయి. కొన్ని కుకీ గ్రూపులు ఇప్పటికే లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాయి.

సభలు, సమావేశాలకు దూరం

బీజేపీ, కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, నాగా పీపుల్స్ ఫ్రంట్, మణిపూర్ పీపుల్స్ పార్టీల అభ్యర్థులు ఇళ్లు, పార్టీ ఆఫీసుల వద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు, కార్యకర్తలు క్యాంపుల వద్దకు వచ్చే ధైర్యం చేయలేక పోతున్నారు. వస్తే తమ దారుణ స్థితిగతులపై బాధితులు నిలదీస్తారనే భయం వారిని వెంటాడుతున్నది. బీజేపీ అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి బసంత్ కుమార్ సింగ్ తన ఇల్లు, పార్టీ ఆఫీస్​ దాటి బయటకు రావడం లేదు. అక్కడే సమావేశాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అకోయిజందీ అదే పరిస్థితి. రాహుల్ జోడో యాత్ర పోస్టర్లను కేవలం పార్టీ ఆఫీసు వద్దే ఏర్పాటు చేశారు.

మణిపూర్​లో ఓటర్లెంత?

మొత్తం 20,26,623 మంది ఓటర్లున్నారు. వీరిలో 9,79,678 మంది పురుషులు, 10,46,706 మంది మహిళలు ఉన్నారు. 239 మంది థర్డ్ జెండర్స్ ఓటర్లున్నారు.

2024లో బరిలో ఉన్నదెవరు?

ఔటర్ మణిపూర్​లో కాంగ్రెస్ నుంచి ఆల్ఫ్రెడ్ ఆర్థర్ కంగామ్ బరిలో ఉన్నా డు. ఎన్పీఎఫ్ నుంచి కచుయ్ తిమోతి జిమిక్, ఎస్​ ఖో జాన్, అలిసన్ అబోన్మై లు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు.

ఇన్నర్ మణిపూర్​లో బీజేపీ నుంచి బసంత్ ​కుమార్ సింగ్, కాంగ్రెస్​ నుంచి బిమోల్ అకోయిజం, ఆర్​పీఐ (ఏ) నుంచి మహేశ్వర్, స్వతంత్రులుగా రాజ్​కుమార్,  తోటోమ్‌‌షానా, శరత్ సింగ్ బరిలో ఉన్నారు.

2019లో ఎన్డీఏ కూటమిదే..

అల్లర్ల కారణంగా ఈసారి పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది.. గత ఎన్నికల్లో ఇన్నర్​ మణిపూర్​లో బీజేపీ, ఔటర్​లో నాగా పీపుల్స్ ఫ్రంట్.. వెరసి రెండూ ఎన్డీఏ కూటమే దక్కించుకుంది.

రిలీఫ్ క్యాంపుల్లో పోలింగ్​..

300కు పైగా రిలీఫ్ క్యాంపుల్లోని వారందరూ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్యాంపుల్లో దాదాపు 25 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 94 స్పెషల్ పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేస్తున్నది. 16 జిల్లాల్లోని 10 జిల్లాల్లో ఉన్న క్యాంపుల్లో ఇవి సెట్ చేస్తున్నది. మిగిలిన వారంతా తమ తమ ఇండ్లకు దగ్గర్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయాలని ఈసీ కోరుతున్నది.