ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని ఒక వరంగా భావిస్తాం. కానీ, సరిగ్గా గమనిస్తే ఒక నిశ్శబ్ద తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా ‘జెన్- జెడ్’ ఉద్యోగులు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని తెలివిగా అడ్డుకుంటున్నారు. దీన్ని ఎక్స్పర్ట్స్ ‘సైలెంట్ సబోటేజ్’ అని పిలుస్తున్నారు.జెన్ జెడ్ చిన్నప్పటినుంచి స్మార్ట్‌ఫోన్లతో పెరిగినవాళ్లు. టెక్నాలజీపై వాళ్లకి మంచి పట్టు ఉంది. కానీ, ఇప్పుడు అదే టెక్నాలజీ తమ స్థానాన్ని భర్తీ చేస్తుందనే భయం వారిని ‘డెస్ట్రయర్స్’గా మారుస్తోంది. కంపెనీలు ఇచ్చే ఏఐ టూల్స్‌ను వాడకపోవడం, తప్పుడు డేటాను ఫీడ్ చేయడం ద్వారా అల్గారిథమ్స్ తప్పుగా పని చేసేలా చేస్తున్నారు. ఇది కేవలం భయం కాదు.
ఒక రకమైన మనుగడ పోరాటం. రాబోయే ఐదేళ్లలో ‘ఏఐ షేమ్’ అనేది ఆఫీసుల్లో పెద్ద సమస్యగా మారనుంది. ఒక పనిని ఏఐ సాయంతో పూర్తి చేస్తే, ఆ ఉద్యోగికి స్కిల్ లేదని తోటివారు భావిస్తారనే భయం మొదలైంది. దీనివల్ల ప్రతిభావంతులైన యువత కూడా ఏఐని రహస్యంగా వాడుతూ, బయటకు మాత్రం ‘మేం సొంతంగానే చేశాం’ అని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇది సంస్థల్లో పారదర్శకతను దెబ్బతీస్తుంది. భవిష్యత్తులో జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, కంటెంట్ రైటర్లు, డేటా అనలిస్టుల అవసరం తగ్గిపోవచ్చు. ఈ ఖాళీని ఏఐ భర్తీ చేస్తుందని జెన్ జెడ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే, ఏఐ ప్రాజెక్టులను నీరుగార్చడం ద్వారా తమ అవసరాన్ని కంపెనీలకు గుర్తు చేయాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు.
దీనివల్ల కంపెనీల వృద్ధి రేటు తగ్గే ప్రమాదం ఉంది. దీనికి పరిష్కారంగా కంపెనీలు కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేస్తే సరిపోదు. మైండ్-సెట్‌ను అప్‌గ్రేడ్ చేయాలి. ఏఐ అనేది ఉద్యోగిని తొలగించడానికి కాదు, అతని పని భారాన్ని తగ్గించడానికే అని నమ్మకం కలిగించాలి. పాత పనుల స్థానంలో ఏఐని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ‘ప్రాంప్ట్ ఇంజనీరింగ్’ వంటి కోర్సులను తప్పనిసరి చేయాలి. ఏఐ వాడకం వల్ల ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదని మేనేజ్మెంట్ భరోసా ఇవ్వాలి. ఏదేమైనా టెక్నాలజీ రివల్యూషన్ ఎప్పుడూ పాత పద్ధతులను తొలగించి కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే, ఆ మార్పులో మనిషిని భాగస్వామిని చేయనంతవరకు ఇటువంటి ‘సబోటేజ్’ ఎగ్జాంపుల్స్ పెరుగుతూనే ఉంటాయి. 2030 నాటికి కార్పొరేట్ సక్సెస్ అనేది ఎంత గొప్ప ఏఐని వాడుతున్నాం అనే దానిపై కాకుండా ఏఐ, మనిషి మధ్య ఎంత గొప్ప సమన్వయం ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
