Ugadi Rasi Phalalu 2023 - Simha Rashi : సింహ రాశి ఫలితాలు

Ugadi Rasi Phalalu 2023 - Simha Rashi  : సింహ రాశి ఫలితాలు

గురువు 22.03.2023 నుంచి 21.04.2023 వరకు మీనరాశి యందు అష్టమంలో తదుపరి ఉగాది వరకు నవయం లాభ స్థానమందు సంచారం. శని 22.03.2023 నుంచి 08.04.2023 వరకు సప్తమ స్థానంలో సంచారం.  రాహువు 22.03.2023 నుంచి 30.10.2023 వరకు నవమ తృతీయంలోను తదుపరి ఉగాది వరకు అష్టమ స్థానంలో సంచారం. కేతువు 30.10.2023 నుంచి ఉగాది వరకు అష్టమ స్థానంలో వల్ల ధనహానిలో సంచారం.

ఈ రాశి స్త్రీ పురుషులకు ఆదాయ వనరులకు లోటు ఉండదు. కానీ, గ్రహ కలయిక ప్రభావం వలన ప్రతి విషయంలో చాకచక్యంగా నడుచుకోగలరు. రైతు సోదరులు ముహూర్త బలంతో వ్యవసాయంలో పంటలు వేసిన అధిక దిగుబడి ఆర్థిక లాభం. డాక్టర్లు, లాయర్లకు ఆకస్మిక ధన లాభం. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే రోజులు. కానీ, ఆకస్మికంగా మాటపట్టింపులు పోయి, తెలియని బాధలు చుట్టుముడతాయి. చట్టాన్ని గౌరవించాలి. చట్టప్రకారమే ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. చిన్న పరిశ్రమల వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ, శని ప్రభావంతో ఏమీ అర్థం కాదు. పెద్ద పరిశ్రమల వారికి కొంత వరకు అనుకూలం. వెండి, బంగారం, ఇనుము, సిమెంట్, టేకు, కలప, ప్లాస్టిక్‌ ధరలు పెరుగుట, తగ్గుట జరుగును. కెమికల్‌ ఇండస్ట్రీ వారికి అనుకూలం. మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ వారికి అనుకూలంగా ఉంటుంది. చిట్స్‌, షేర్స్‌, ఫైనాన్స్‌ వ్యాపారాలు అర్థవంతంగా ఉండవు. విద్యార్థులకు సరస్వతీ దేవి ద్వాదశ స్తోత్ర పారాయణం చేయడం వలన అధిక మార్కులు. ఉద్యోగులకు ఆకస్మికంగా బదిలీలు జరుగును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. జాయింట్‌ వ్యాపారాల్లో కొన్ని వివాదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రావాల్సిన బాకీ డబ్బులు సమయానికి రావు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి అనారోగ్య సూచనలు. ఇంటి స్థలాలు, ఫ్లాట్లు, ఆభరణాలు, వాహనాలు కొనాలనుకుంటే కొనగలరు. తక్కువగా మాట్లాడండి. మీ విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం వలన సంఘంలో మీ విలువ పెరుగుతుంది. వివాహాలు, శుభయోగాలు ఉన్నవి. విద్యార్థులకు విదేశీయానం ఉంది. గురు బలం సరిగా లేదు. అనారోగ్య సమస్యలు రావచ్చు. రాహుకేతువులకు ప్రత్యేక పూజలు, జపం, ధ్యానం చాలా అవసరం. ఎవరితోనూ వాదోపవాదాలకు వెళ్లొద్దు. ఇది సమయం కాదు. ఉద్రేకానికి లోను కారాదు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీపైన దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర సంబంధమైన ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు. రాహుకేతువులు మీకు అంత అనుకూలంగా లేరు. ప్రతి రోజు అష్టోత్తర సహస్ర నామాలు చేయించుకుంటే ఈ విధమైన ప్రయోగాలు జరగవు. మఘ నక్షత్రం వారు జాతి వైఢూర్యం ధరించండి. చిత్రగుప్త దేవాలయ పూజలు, వినాయక, సరస్వతీ పూజలు, కేతు పూజ ఫల దీపికలు పంచండి. పుబ్బ నక్షత్రం వారు జాతి డైమండ్‌ ధరించండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు చేయండి. అష్టోత్తర సహస్ర నామాలు జపించండి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉత్తర నక్షత్రం వారు జాతి కెంపు ధరించండి. ఆదివారం నియమంగా ఆదిత్య హృదయ పారాయణం, సూర్య దండకం చేయండి. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, పారాయణం చేయడం వలన మనఃశ్శాంతి కలుగుతుంది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈ సంవత్సరం అంతా కేతు గ్రహ జపం, శుక్ర గ్రహ జపం, రవి గ్రహ జపం చేయడం వలన సమస్యలు దగ్గరకు రావు. మీరు నమ్మకంతో పాటించినా ఫలితాలు పొందగలరు. అదృష్ట సంఖ్య1.

సింహ రాశి మాస ఫలితాలు

చైత్ర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్య ఫలితాలు. ప్రతి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. తక్కువగా మాట్లాడి, ఎక్కువ పనిచేయడం వలన పంతాలు, పట్టింపులు ఉండవు. నవగ్రహ జపాలు, కేతు పారాయణం, చిత్రగుప్తునికి బుధవారం పూజలు చేయడం వలన ఆకస్మిక ధన లాభం ఉంది.  

వైశాఖ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ఆర్థికపరమైన సమస్యలు రావొచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికి హామీగా ఉండొద్దు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అంతమంచిది కాదు. సత్య దేవుని వ్రతం చేయండి. సుఖశాంతి కలుగుతుంది.

జ్యేష్ఠ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు అనుకూలంగా ఉంటుంది. నూతన అగ్రిమెంట్స్ చేయుటకు అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఆ అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ అయ్యేందుకు కూడా ఛాన్స్‌ ఉంది. విద్యార్థులు సరస్వతీ పూజలు, దక్షిణామూర్తి పూజలు చేయాలి. ఆశానిరాశ మధ్యలో ఈ నెల గడుస్తుంది. మీ విశ్వాసమే మీ గెలుపు. 

ఆషాఢ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. ఏ విషయంలో చిరాకు పడొద్దు. ఆదాయ వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. మీరు పట్టుదలతో కార్యాన్ని సాధించాలి. తొందరపాటు పనికిరాదు. పెద్దలను గౌరవించండి. లక్ష్మీ నారాయణుల నిత్య పారాయణం చేయండి.

అధిక శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు కాస్త మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగాఉండాలి. 
గృహ మార్పులు, స్థాన చలనం, బంధువులతో విరోధాలు ఉన్నాయి. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. రాజకీయ నాయకులకు పదవీ గండం ఉంది. ఈ విషయం గురించి మీరు తెలుసుకునేలోపు మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం, చక్కెర పొంగలి ప్రసాదం పంచండి. 

నిజ శ్రావణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనకూలం. చాలా ఉత్సాహంగా ఉంటారు. విష్ణు సహస్ర పారాయణం, లలిత సహస్ర నామ స్తోత్రం చేయండి. దైవ బలం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. విజయం పక్కనే ఉంటుంది. 

భాద్రపద మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు బంధు మిత్రులను కలిసినప్పుడు, వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే విజయం ఉంటుంది. ఆకస్మిక ధన లాభం. ఉద్యోగ లాభం, శుభకార్యాలు జరిగే అవకాశాలు.  

ఆశ్వయుజ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు సామరస్య ధోరణితో విజయం సాధించగలరు. వృత్తి వ్యాపారుల్లో పూర్తి అనుకూలం. ఆకస్మిక ధన లాభం. అధికారులతో చాలా మెలకువగా ఉండాలి. విజయం మీ వెంటే ఉంటుంది. తొందరపాటు జరిగితే పరిస్థితులు మీకు అందుబాటులో ఉండవు. అన్నవరం శ్రీసత్య దేవుడి వ్రతం ఆచరించండి. 

కార్తీక మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో హుందాతనంగా ఉండాలి. మీరు నిబ్బరంగా ఉండండి. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఓ పని పూర్తి చేస్తారు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. హామీ ఉండొద్దు. అవసరాలు వాయిదా వేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. 

మార్గశిర మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు ప్రతి విషయంలో అనుకూలంగా ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అష్టమ శని వలన ఏదైనా సమస్య వస్తే, శనికి తైలాభిషేకం, దానాలు, జపాలు చేయించి విజయం పొందండి. మహాన్యాస రుద్రాభిషేకం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

పుష్య మాసం: ఈ నెలలో ఈ రాశి స్త్రీ పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి ప్రభావం వల్ల ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నియమాలు పాటించాలి. సూర్యారాధన, గోధుమల దానం, రవి గ్రహ జపం వలన ఇబ్బందులు తొలగిపోతాయి. రవి పూజా ఫల దీపికలు పంచండి.  

మాఘ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులకు చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహాల కాంబినేషన్‌తో చక్కటి ఫలితం రాగలదు. అధికారులతో అనుకూలంగా ఉండండి. మానసిక ధోరణి, నిరాశ నిస్పృహలకు అవకాశం ఇవ్వొద్దు. అనారోగ్యం పాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. 

ఫాల్గుణ మాసం: ఈ రాశి స్త్రీ పురుషులు చాలా వ్యతిరేకత కలిగి ఉన్నారు. గ్రహ కలయిక సరిగా లేదు. తెలియకుండా ఏదో ఒక చికాకు బాధిస్తుంది. కుటుంబంలో సమస్యలు తగాదాలు ఉండే అవకాశం ఉంది. విద్యార్థుల పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వాళ్లు విజయం సాధిస్తారు. నవగ్రహ ఆరాధన చేసి, దానాలు చేయండి.