బోర్డు ఎగ్జామ్ ఫీజు పేరుతో బాదుడు

బోర్డు ఎగ్జామ్ ఫీజు పేరుతో బాదుడు

బోర్డు ఎగ్జామ్ ఫీజు పేరుతో బాదుడు
రూ.125 కంటే ఎక్కువ వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల మేనేజ్​మెంట్లు 

హైదరాబాద్, వెలుగు : ఈ ఏడాది స్కూళ్లు మొదలైనప్పటి నుంచి స్టూడెంట్ల  పేరెంట్స్ ఏదో ఒక రకంగా ఫీజుల బాదుడుకు గురవుతూనే ఉన్నారు. 2022–23 విద్యాసంవత్సరానికి కార్పొరేట్, ప్రైవేట్​స్కూళ్లు 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచిన విషయం తెలిసిందే. వీటికి తోడు డొనేషన్లు, నోట్‌‌‌‌బుక్‌‌‌‌లు, స్టేషనరీ, యూనిఫామ్, బస్ ఛార్జీ ఇలా అనేక విధాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు బోర్డ్‌‌‌‌ ఎగ్జామ్ ఫీజు పేరుతో మళ్లీ పేరెంట్స్ పై బాదుడు మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో టెన్త్​ క్లాస్​పబ్లిక్ ఎగ్జామ్స్​జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినదానికంటే ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు

టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్​కోసం స్టూడెంట్లు సంబంధిత స్కూల్​లో ఫీజు కట్టేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మొదట అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 31 నుంచి నవంబర్ 15 వరకు కట్టొచ్చని తెలిపింది. తర్వాత ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. ఎగ్జామ్ ఫీజు రూ.125గా ప్రభుత్వం పేర్కొంది. కానీ ప్రైవేట్ మేనేజ్ మెంట్లు మాత్రం రూ. నాలుగైదు వేలు వసూలు చేస్తున్నట్లు పేరెంట్స్ చెప్తున్నారు. దసరా టైమ్​లో టర్మ్ ఫీజు కట్టించుకుని ఇప్పుడు మళ్లీ రూ. వేలకువేలు కట్టమనడం సరికాదని వాపోతున్నారు. ఫీజుల విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంకెన్ని రకాలుగా అంటూ..

ఈ ఏడాది ఫిజికల్ క్లాసులు మొదలుపెట్టి  స్కూల్ ఫీజులు పెంచడంతో కట్టేందుకు పేరెంట్స్​తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్​ను బట్టి జాయిన్ చేసే సమయంలో డొనేషన్ రూ.10వేల నుంచి 50 వేలు, అడ్మిషన్ ఫీజు మరో రూ.10వేలు, క్లాస్ ని బట్టి టర్మ్ ఫీజు ఉంటుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ తమ పిల్లలను జాయిన్ చేశారు. టెన్త్  క్లాస్​కు అడిషనల్‌‌‌‌ ఫీజులను సందర్భాన్ని బట్టి  ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు బోర్డ్‌‌‌‌ ఎగ్జామ్స్ పేరుతో మళ్లీ మొదలుపెట్టారని పేరెంట్స్ చెప్తున్నారు. ఒక్కో చోట రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు కలెక్ట్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. తాము చెప్పిన ఫీజు కంటే అదనంగా వసూలు చేస్తే స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్‌‌‌‌సీ బోర్డ్ చెప్పినప్పటికీ.. చర్యలు మాత్రం కనిపించడం లేదు. 

రెండున్నర వేలు కట్టమన్నరు

మా అమ్మాయి టెన్త్​ క్లాస్​చదువుతోంది. మొన్ననే రూ.20 వేల స్కూల్ ​ఫీజు కట్టాం. మళ్లీ బోర్డ్ ఎగ్జామ్ ఫీజు అని రెండున్నర వేలు కట్టమన్నారు. ఇదేంటని అడిగితే స్పెషల్ క్లాసులు, ఎఫ్‌‌‌‌ఏ 1 ఎగ్జామ్‌‌‌‌లో ప్రాక్టికల్ మార్కుల వెరిఫికేషన్ సమయంలో అధికారులకు ఇవ్వాలని, ఆన్​లైన్‌‌‌‌లో అప్లయ్ చేయడానికి అమౌంట్ అవుతుందని పలు కారణాలు చెప్పారు. ఈసారి ఫైనాన్షియల్​గా చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల భవిష్యత్ కోసం అప్పు చేయాల్సి వస్తోంది. 
- మమత, పేరెంట్, ముషీరాబాద్

ఇష్టానుసారంగా వసూలు  

బోర్డు ఎగ్జామ్ ఫీజు రూ.125గా ప్రభుత్వం నిర్ణయిస్తే.. కొన్ని ప్రైవేటు స్కూళ్లు రూ.2 వేల నుంచి 5 వేల వరకు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. దీనిపై మేం గతంలో కూడా అధికారులకు కంప్లయింట్ చేశాం. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి.
- షబ్బీర్ అలీ, అధ్యక్షుడు, తెలంగాణ  ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ 

ఫీజుల దోపిడీపై పోరాడతాం

ప్రైవేట్ స్కూల్​లో ఫీజుల దోపిడీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరోనా టైమ్​లో  ఎగ్జామ్స్ లేకుండా ప్రమోట్ చేసినప్పుడు సైతం ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. అయినా కూడా ఎవరూ స్పందించడంలేదు. ఈ విషయంపై మేం పోరాడతాం. 
- వెంకట్ సాయినాథ్, జాయింట్ సెక్రటరీ, హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌పీఏ