
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ వెస్ట్ కోస్ట్ లో నివసిస్తున్న సింధీలకు.. పాకిస్తాన్ లోని సింధీలకు ఎలాంటి జెనెటికల్ రిలేషన్ లేదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. అంతేకాదు, పాకిస్తాన్ లోని మంగోల్ మూలాలున్న బురుషో, హజారా తెగలతో వీరికి దగ్గరి సంబంధాలు ఉన్నట్టు రీసెర్చ్ స్పష్టంచేసింది. ఇండియన్ వెస్ట్ కోస్ట్ లో పోర్చుగీసు, యూదులు, పార్శీలు వంటి అనేక జాతుల జెనెటిక్స్ పై అనేక రీసెర్చ్ లు జరిగాయి. కానీ, మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో సామాజికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకతను చాటుకుంటున్న సింధీ ప్రజల జెనెటికల్ హిస్టరీపై ఇంతవరకు లోతైన రీసెర్చ్ జరగలేదు. ఈ లోటును పూడ్చేందుకు సీసీఎంబీ సైంటిస్టులు డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, డాక్టర్ లోమస్ కుమార్ టీమ్ మహారాష్ట్రలోని థానే జిల్లాలో నివసిస్తున్న 13 మంది సింధీల డీఎన్ఏ నమూనాలను సేకరించింది.
దాదాపు 6 లక్షల జన్యు మార్కర్లను ఉపయోగించి అత్యంత అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో వారి జెనెటికల్ స్ట్రక్చర్, మైగ్రేషన్ హిస్టరీ, స్థానిక ప్రజలతో వారి రిలేషన్స్ ను విశ్లేషించారు. ఈ స్టడీ వివరాలు ఇటీవలే హ్యూమన్ జెనోమిక్స్ అనే ఇంటర్నేషనల్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. భారత సింధీలు, పాకిస్తాన్ సింధీల జెనెటిక్ స్ట్రక్చర్ లో స్పష్టమైన తేడాలున్నాయనే ఆసక్తికరమైన విషయం ఈ రీసెర్చ్ లో వెల్లడైంది. భారత సింధీల డీఎన్ఏలో ఈస్ట్ ఆసియా (మంగోల్) జన్యువుల ఆనవాళ్లు కనిపించగా, పాకిస్తాన్ సింధీలలో అవి లేవు. దీంతో ఈ రెండు సమూహాల మూలాలు వేర్వేరని సైంటిస్టులు నిర్ధారించారు.
సింధీల జీన్స్ విశిష్టమైనది: కుమారస్వామి
ఇండియన్ వెస్ట్ కోస్ట్ లో సింధీల జెనెటికల్ స్ట్రక్చర్ చాలా విశిష్టమైనది సీసీఎంబీ సైంటిస్ట్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. ‘‘పాకిస్తాన్ లోని మంగోల్ లక్షణాలున్న బురుషో, హజారా వంటి తెగలతో వీరికి జెనెటికల్ కంపారీజన్స్ ఉన్నాయి. బహుశా మంగోలుల దండయాత్రల కాలంలో లేదా ఆ తర్వాత బురుషో, హజారాలతో ఏర్పడిన సంబంధాల కావొచ్చు’’ అని తంగరాజ్ వివరించారు. అలాగే, పాకిస్తాన్ లోని సింధీ ప్రాంతం నుంచి వలస వచ్చిన తర్వాత భారత సింధీలు స్థానిక కొంకణ్ సమాజంలో జెనెటికల్ గా కలిసిపోయారని ఈ రీసెర్చ్ లో వెల్లడైంది. అంటే, సింధీలు, కొంకణి ప్రజల మధ్య వివాహ సంబంధాలతో జన్యు సంబంధ ఏర్పడిందని సైంటిస్టులు తేల్చారు.