సింధు ప్రజల కళారూపాలు

సింధు ప్రజల కళారూపాలు

భారతదేశంలోనే అత్యంత పురాతన నాగరికతగా, ప్రపంచంలోనే ఈజిప్టు, చైనా నాగరికతలకు సమానంగా వర్ధిల్లిన నాగరికతగా సింధు నాగరికత పేరు గాంచింది. సింధు ప్రజల పట్టణ ప్రణాళిక, భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ ప్రపంచానికే ఒక దిశానిర్దేశం చేసిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వీరు వినియోగించిన ముద్రికలు, టెర్రాకోట బొమ్మలు, ఇతర లోహ బొమ్మలు, కుండలు ఆనాటి ప్రజల నాగరికతను తెలుసుకోవడంలో  ఎంతో ఉపకరిస్తున్నాయి. 

ముద్రికలు

సింధు నాగరికత కాలం, సింధు నాగరికతను విశ్లేషించడంలో ముద్రికలు ప్రధాన ఆధారాలు. ఈ ముద్రికలను సింధు ప్రజలు అత్యంత కళాత్మకంగా తయారుచేశారు. వీటిని స్టియటైట్​ అనే మెత్తని రాయితో తయారు చేశారు. ఇప్పటివరకు 1400 స్థలాల నుంచి దాదాపు 4000 వరకు ముద్రికలు కనుగొన్నారు. మొహెంజొదారోలో అత్యధికంగా 1398 ముద్రికలు, హరప్పాలో 891 ముద్రికలు కనుగొన్నారు. ఈ ముద్రికల్లో అత్యంత ప్రధానంగా మూపురం లేని ఎద్దు బొమ్మ కనిపించేది. చేప గుర్తు గల ముద్రికను అత్యంత శుభప్రదమైనదానిగా భావించేవారు. 

ముద్రికలు ప్రధానంగా మూడు రకాలు 

1. చతురస్రాకారం: చాలా ప్రదేశాల్లో లభ్యమయ్యాయి. 
2. దీర్ఘచతురస్రాకారం: కాళిబంగన్​ (రాజస్థాన్​)లో లభ్యమయ్యాయి.
3. వృత్తాకారం: జుకార్​(ప్రస్తుత పాకిస్తాన్​)లో లభ్యమయ్యాయి. 

ముద్రికలపై ముద్రించిన ముఖ్యమైన జంతువులు: వృషభం, ఏనుగు, కొమ్ములున్న పులి, ఖడ్గమృగం, చేప, మహిషం, కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడు. ఇందులో యోధుడి శిరస్సు సూర్యున్ని తలపించగా, పులి చీకటి శక్తులకు సంకేతంగా స్ఫురిస్తుంది. నాటి సమకాలీన నాగరికత అయిన మెసొపొటేమియా నాగరికత ప్రజలు స్తూపాకార ముద్రికలు ముద్రించేవారు. మొహెంజొదారో తవ్వకాల్లో మూడు స్తూపాకార ముద్రికలు లభ్యమయ్యాయి. దీనిద్వారా సింధు ప్రజలకు, మొసొపొటేమియా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవని తెలుస్తోంది.

టెర్రాకోట బొమ్మలు

టెర్రాకోట బొమ్మలు సింధు నాగరికత ప్రజల సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. కాల్చిన బంకమట్టితో స్త్రీ, పురుషులు, జంతువులు, ఆట బొమ్మలను తయారు చేశారు. వీరి మృణ్మయ బొమ్మల్లో ఎక్కువగా కోతి బొమ్మలు కనిపిస్తాయి. 

ఇతర లోహాల బొమ్మలు

సింధు ప్రజలు పాత్రల తయారీకి మట్టితోపాటు వెండి, రాగి, కంచు తదితర ఇతర లోహాలు వినియోగించారు. వీరు ఎక్కువగా కాంస్యం ఉపయోగించారు. ప్రపంచంలో మొదటిసారిగా వెండిని వాడింది వీరే. వీరి అద్భుతమైన కళకు నిదర్శనం మొహెంజొదారోలో బయల్పడిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం. కాగా వీరి కళాభ్యున్నతికి మరో నిదర్శనం గడ్డం ఉన్న పురుషుని విగ్రహం. దైమాబాద్​(మహారాష్ట్ర)లో జరిపిన తవ్వకాల్లో కాంస్యంతో చేసిన ఏనుగు, ఖడ్గమృగం, రథం బొమ్మలు బయట పడ్డాయి. నాట్యగత్తె నెక్లెస్ ధరించి నగ్నంగా ఉంది. కుడిచేయి నడముపై, ఎడమ చేయి గాజులతో విశ్రాంత స్థితిలో ఉంది. 

సింధు నాగరికత ప్రజలకు తెలియనివి

లోహం    : ఇనుము
వస్త్రం    : సిల్క్​
జంతువులు: గుర్రం, జిరాఫీ, సింహం
పంటలు    : చెరుకు, పప్పుదినుసులు

కుండలు 

నల్ల బంకమట్టితో కుండలను తయారు చేసేవారు. కుండలపై రేఖాకృతులను, చిత్రాలను నల్లటి పూతతో చిత్రీకరించేవారు. సింధు నాగరికత వాసులకు కుండలకు బ్లాక్​ పాలిష్డ్​ వేర్​ పాటరీ అనే పేరు ఉంది. మట్టిపాత్రల అలంకారాల్లో ఎక్కువగా ఆకులు కనిపిస్తాయి. చెల్లు, వలయాలు కూడా ఉన్నాయి.