పసికందులకు తల్లిపాలు దానం చేస్తుంది

పసికందులకు తల్లిపాలు దానం చేస్తుంది

ఏటా కొన్ని వేల మంది పసికందులు పుట్టినప్పుడు తల్లి పాలు అందక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. అలాంటి పిల్లల ఆకలి తీర్చి, వాళ్లను రక్షించేందుకు 29 ఏండ్ల సింధు మౌనిక ఇప్పటి వరకు దాదాపు 42 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ ని దానం చేసింది. 1,400 మంది పిల్లల ఆకలిని తీర్చింది. 2021 సంవత్సరం నుంచి తల్లి పాలను దానం చేస్తూ ఆమె రికార్డ్ సాధించింది. 

తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన సింధు తన కూతురు పుట్టిన 100వ రోజున హాస్పిటల్ లో ఉన్న ఒక పసికందుకు పాలు దానం చేసింది. ఆ పని సింధుకు సంతోషాన్ని ఇవ్వడంతో ‘అమృత’ అనే ఎన్జీవోతో (తల్లి పాల బ్యాంక్) కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. అమృత ఎన్జీవో కోయంబత్తూర్ లో తల్లుల దగ్గర నుంచి బ్రెస్ట్ మిల్క్ సేకరించి, స్వచ్ఛందంగా పసి పిల్లలకు పంచుతుంటుంది. 

అమృత బ్యాంక్ లో భాగమైన సింధు ఇప్పటి వరకు 42,000 మిల్లీ లీటర్లు (42 లీటర్ల) పాలను దానం చేసింది. అందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. 2020లో ప్రారంభించిన అమృత బ్యాంక్ లో ఇప్పటివరకు 50 మంది మహిళలు పేర్లు నమోదుచేసుకోగా, 30 మంది యాక్టివ్ గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 70 తల్లిపాల బ్యాంక్ లు ఉండగా వాటిలో 45 వరకు తమిళనాడులోనే ఉన్నాయి.