
- బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ మెంబర్‌గా చాన్స్
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్‌లో మూడోసారి మెంబర్‌గా బాధ్యతలు చేపట్టనుంది. ఈ మేరకు 2029 నవంబర్ వరకు కొత్త సభ్యులను బీడబ్ల్యూఎఫ్ శుక్రవారం ప్రకటించింది. 2017 నుంచి 2025 వరకు కమిషన్‌లో పని చేసిన సింధు.. 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ అంబాసిడర్‌గా పని చేస్తోంది. అన్ సే యంగ్ (కొరియా), దోహా హనీ (ఈజిప్టు), జియా యి ఫ్యాన్ (చైనా), డెబోరా జిల్లే (నెదర్లాండ్స్) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ ఐదుగురు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వీరి ఎన్నిక లాంఛనమే అయ్యింది. సింధు మినహా మిగతా నలుగురు తొలిసారి కమిషన్‌లోకి వచ్చారు. ‘మన క్రీడకు అథ్లెట్లు గుండెకాయ లాంటివారు. మనం తీసుకునే నిర్ణయాలు వాళ్ల మాటగా ఉండాలి. బ్యాడ్మింటన్ కమ్యూనిటీకి అవసరమైన సేవ చేసేందుకు అథ్లెట్ల కమిషన్ కట్టుబడి ఉంది. మనమందరం కలిసి బ్యాడ్మింటన్‌ను ప్రపంచలోని ప్రముఖ క్రీడల్లో ఒకటిగా మార్చడానికి కృషి చేయాలి. కొత్త సభ్యులను మేం అభినందిస్తున్నాం. బ్యాడ్మింటన్ భవిష్యత్‌ను రూపొందించడంలో వారి నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం’ అని బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్‌కు అథ్లెట్ల కమిషన్ సంప్రదింపుల సంస్థంగా వ్యవహరిస్తుంది.