- రూ. కోటితో డెవలప్ చేస్తామని అప్పట్లో హరీశ్‌రావు హామీ
- ఏండ్లు గడిచినారిలీజ్ కాని ఫండ్స్
- అధ్వాన్నంగా రోడ్డు.. చెట్ల కిందే భక్తుల బస
- ఈనెల 9న జాతర ప్రారంభం
సిద్దిపేట/ కోహెడ, వెలుగు : సింగరాయ గుట్టను రూ. కోటితో అభివృద్ది చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్న హామీ ప్రకటనకే పరిమితమైంది. ఆఫీసర్లు సర్వే పేరిట హడావిడి చేసి వదిలేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల వద్ద ప్రతిఏటా మాఘ అమావాస్య సందర్భంగా సింగరాయ గుట్టపై శ్రీ ప్రతాప రుద్ర సింగరాయ లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో జాతర జరుగుతుంది. కాకతీయుల కాలంలో కట్టిన ఈ ఆలయంలో జరిగే జాతరకు అనేక ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది భక్తులు హాజరవుతారు. ఈనెల 9న జాతర జరగనుండగా భక్తులకు ఎలాంటి సౌలత్లు కల్పించలేదు.
కనీస వసతులు కరవు
సింగరాయగుట్ట జాతరకు గతంలో హాజరైన అప్పటి మంత్రి హరీశ్‌రావు ఆలయ అభివృద్ధికి రూ. కోటి సాంక్షన్ చేస్తామని ప్రకటించినా ఆ హామీ అమలు కాకపోవడంతో భక్తులకు ఇక్క కనీస వసతులు కూడా కల్పించలేకపోయారు. గుట్టకు సరైన రోడ్డు, తాగునీటి సౌకర్యం, వసతి గదులులేవు. గుట్ట పైకి కాలినడకనే వస్తున్న భక్తులు చెట్ల కిందే ఉండాల్సివస్తోంది.
గుట్ట పైకి వెళ్లే రోడ్డు దాదాపు రెండు కిలో మీటర్ల మేరకు పూర్తిగా ధ్వంసమైంది. భారీ వర్షాల వల్ల అరకిలో మీటరు మేర రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. నిధులు లేక జాతర సందర్భంగా కూడా రోడ్డుకు రిపేర్లు చేయలేదు. మోయ తుమ్మెద వాగులో పుణ్యస్నానాలు చేస్తే బట్టలు మార్చుకునేందుకు కూడా వసతి లేకపోవడంతో ఆడవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకటనే తప్ప ఫండ్స్ ఇయ్యలే
అప్పటి మంత్రి హరీశ్‌రావు ఫండ్స్ఇస్తామని ప్రకటించడంతో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్లాన్ రెడీ చేశారు. గుట్ట పైకి రోడ్డు, కాటేజీలు, భక్తుల కోసం షెడ్ల నిర్మాణంతో పాటు సింగరాయ ప్రాజక్టు లో బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఓ వైపు పచ్చని అడవి, మరో వైపు మోయ తుమ్మెద వాగుపై సింగరాయ ప్రాజెక్టు ఉన్న ఈ ప్రాంతంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ప్రారంభిస్తే టూరిస్ట్ స్పాట్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
రెండూళ్ల మధ్య పంచాయితీ
సింగరాయ గుట్ట తమ గ్రామ పరిధిలోనే ఉందంటూ కూరెళ్ల, తంగల్ల పల్లి గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడింది. సరిహద్దు వివాదంపై అధికారులు సర్వే చేసినా పంచాయితీ ఎటూ తేలలేదు. దీంతో దేవుడు మావాడేనంటే రెండు ఊళ్ల ప్రజలు పట్టు పడుతుండడంతో వివాదం అలాగే కొనసాగుతోంది. ప్రతి జాతర సమయంలో
ఈ విషయంపై రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. గత ఏడాది ఆర్డీవో జోక్యం చేసుకుని జాతర తర్వాత వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు తగవు తీర్చలేదు. సరిహద్దు వివాదాన్ని వెంటనే తీర్చాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.