సివిల్స్ అభయహస్తం అప్లికేషన్ల గడువు పెంపు..జూలై 12వ తేదీ వరకు స్వీకరణ: సింగరేణి సీఎండీ

సివిల్స్ అభయహస్తం అప్లికేషన్ల గడువు పెంపు..జూలై 12వ తేదీ వరకు స్వీకరణ: సింగరేణి సీఎండీ

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రకటించారు. రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉత్తీర్ణులై, మెయిన్స్‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఈ స్కీమ్ కింద ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 7తో ముగిసినప్పటికీ..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు12వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు బలరామ్ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

అలాగే, సివిల్స్ ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఉత్తీర్ణత సాధించిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కూడా రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహకం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకాన్ని ప్రారంభించారు. 2024లో 140 మంది అభ్యర్థులకు  రూ.లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందించారు. వీరిలో 20 మంది మెయిన్స్‌‌‌‌‌‌‌‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా రూ. లక్ష చొప్పున సాయం అందజేశారు. ఈ ఏడాది కూడా అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయాలని సింగరేణి నిర్ణయించింది.