యూపీలో 49 వేల కోట్ల పోంజీ స్కామ్ .. పీఏసీఎల్ డైరెక్టర్ గుర్నాం సింగ్ అరెస్టు

యూపీలో 49 వేల కోట్ల పోంజీ స్కామ్ .. పీఏసీఎల్ డైరెక్టర్  గుర్నాం సింగ్ అరెస్టు
  • పంజాబ్​లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: దాదాపు రూ.49 వేల కోట్ల విలువైన పోంజీ స్కామ్  కేసులో పీర్ల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్  లిమిటెడ్ (పీఏసీఎల్) డైరెక్టర్  గుర్నాం సింగ్(69) ను ఉత్తరప్రదేశ్  పోలీస్  డిపార్ట్ మెంట్ కు చెందిన ‘ది ఎకనామిక్  అఫెన్స్‌‌‌‌ స్  వింగ్’ (ఈఓడబ్ల్యూ) అధికారులు అరెస్టు చేశారు. గురువారం పంజాబ్ లోని రూప్ నగర్  జిల్లాలో గుర్నాంను అదుపులోకి తీసుకున్నారు. యూపీ, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, కేరళ సహా మొత్తం పది రాష్ట్రాల్లో ఐదు కోట్ల మంది పెట్టుబడిదారులను గుర్నాం మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. 

తమ సంస్థలో పెట్టుబడులు పెడితే జాగాలు ఇస్తామని, భారీ మొత్తంలో రిటర్నులు ఇస్తామని పెట్టుబడిదారులను పీఏసీఎల్  ఫేక్  రియల్ ఎస్టేట్  స్కీములతో నమ్మించింది. అంతేకాకుండా ఆర్బీఐ నియమాలను సైతం ఉల్లంఘించింది. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం పది మంది నిందితులుగా తేలారు. వారిలో ఇదివరకే నలుగురు జైల్లో ఉన్నారు. తాజాగా గుర్నాం సింగ్ ను ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాగా.. ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్(ఈడీ) కూడా పీఏసీఎల్, దాని అనుబంధ కంపెనీలపై కేసు నమోదు చేసింది. డొల్ల కంపెనీల ద్వారా ఒక్క యూపీలోనే నిందితులు రూ.19 వేల కోట్లు సేకరించారని ఈడీ అధికారులు తెలిపారు.