మందమర్రి, వెలుగు: రాష్ట్ర సర్కారు తీరుతో సింగరేణిలో ఏడేండ్లుగా ప్రైవేటైజేషన్ పెరిగిపోయి, పర్మినెంట్ కార్మికులు తగ్గుతున్నారు. తెలంగాణ వస్తే ఓపెన్‌కాస్టులకు బదులు అండర్ గ్రౌండ్ బాయిలను ఏర్పాటు చేసి పర్మినెంట్ కార్మికుల సంఖ్యను లక్షకు పెంచుతామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్అనేకసార్లు చెప్పారు. కానీ తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు గడిచినా సింగరేణిలో కొత్తగా ఒక్కటంటే ఒక్క అండర్‌గ్రౌండ్ మైన్‌ను ఏర్పాటు చేయలేదు. పైగా ఉన్నవాటిలో 13 మూతపడ్డాయి. సేమ్ టైం ఓసీపీలు14 నుంచి 20కి పెరిగాయి. ఓసీపీలతో పాటే ప్రైవేటైజేషన్ కు తలుపులు తెరిచారు. ఒక్కో విభాగాన్ని కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ వచ్చారు. ఫలితంగా 2014లో 59 వేలుగా ఉన్న పర్మినెంట్ కార్మికుల సంఖ్య ప్రస్తుతం 43 వేలకు పడిపోయింది. అదే సమయంలో అప్పుడు 18వేలుగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు 30 వేలకు చేరుకున్నారు. తాజాగా రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం యత్నిస్తుండడంతో సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తున్నారు. మరి ఏడేండ్లుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్నది ప్రైవేటీకరణ కిందికి రాదా? అని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏడేండ్లలో ప్రైవేటీకరణ జోరు
టీఆర్ఎస్ సర్కార్ కంట్రోల్లో పనిచేసే సింగరేణి మేనేజ్మెంట్గడిచిన ఏడేండ్లుగా అధికోత్పత్తే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా మెకనైజేషన్, ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధినిచ్చే యూజీలను కాదని ఓసీపీలను పెంచుతోంది. 2003లో కోయగూడెం సర్ఫేస్ మైన్‌ను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సింగరేణిలో 17 రోజుల సమ్మె జరిగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద సమ్మెగా దీన్ని చెప్పొచ్చు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో జాతీయ కార్మిక సంఘాలు ఛరిస్మా కోల్పోయాయి. 2012, 2017 సంవత్సరాల్లో వరుసగా టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. 2014 తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం, సింగరేణిలో గుర్తింపు సంఘం, యాజమాన్యంపై పెత్తనం.. ఇలా అన్నీ టీఆర్ఎస్పెద్దల కంట్రోల్లోకి వచ్చాయి. దీంతో ప్రైవేటైజేషన్ స్పీడ్ పెంచారు. మొదట్లో సర్ఫేస్ డిపార్ట్మెంట్లన్నింటినీ ప్రైవేటుపరం చేశారు. తర్వాత ఓసీపీల్లో ఓబీ(ఓవర్‌బర్డెన్) వెలికి తీసే పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించడం మొదలైంది. సింగరేణి కంపెనీ వెహికల్స్ తొలగించి ప్రైవేటు వాళ్లకు చాన్స్ ఇచ్చారు. గెస్ట్ హౌస్‌లు, సివిల్ డిపార్ట్మెంట్లనూ కాంట్రాక్టర్లకు అప్పగించారు. కోల్ ట్రాన్స్పోర్ట్, సీహెచ్‌పీల్లో షేల్ పికింగ్, ఎస్అండ్పీసీ లాంటి విభాగాల్లోనూ ప్రైవేట్, అవుట్సోర్సింగ్ఏజెన్సీలను దింపేశారు. ఆఖరికి కంపెనీ దవాఖానాల్లోనూ వార్డుబాయ్స్, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించారు. పర్మినెంటు పనిస్థలాల్లో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు చోటు కల్పించడం ప్రారంభించారు. మెకనైజ్డ్ మైన్స్ పేరుతో యూజీలో ఉత్పత్తి ఖర్చు తగ్గించేందుకు రూఫ్ బోల్టింగ్ పనులు, కోల్ కటింగ్, ట్రామింగ్, టింబరింగ్ పనుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు చోటిచ్చారు. ఫైర్సీల్స్, టబ్ క్లీనింగ్ పనులు కూడా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ద్వారా చేపడుతున్నారు. మొత్తంమీద ఓసీపీల్లో 70శాతం, డిపార్ట్మెంట్లలో 70శాతం, యూజీల్లో 30శాతం ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేశారు. ఇటీవల శాంతిఖని వంటి గనుల్లో నేరుగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కూడా ప్రైవేటు సంస్థలకు ఛాన్స్ కల్పించడాన్ని బట్టి సింగరేణిలో ప్రైవేటీకరణ ఎంత పీక్స్‌కు చేరిందో అర్థం చేసుకోవచ్చు.
తగ్గుతున్న పర్మినెంట్ కార్మికులు
సింగరేణి లో ప్రైవేటీకరణ కారణంగా పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంఖ్య పెరుగుతోంది. 1989-–90లో లక్షా 16వేల మంది పర్మినెంట్ కార్మికులు ఉంటే 2014 నాటికి 59వేలకు చేరారు. అప్పుడు 36 అండర్ గ్రౌండ్ మైన్స్, 14 ఓపెన్‌కాస్ట్ గనులుండగా, ఈ ఏడేండ్ల లో అండర్ గ్రౌండ్ మైన్ల సంఖ్య 23, ఓసీపీలు సంఖ్య 20కి చేరింది. ఉన్న యూజీలు మూతపడడం , కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఓసీపీలను ప్రైవేట్ కు అప్పగిస్తుండడంతో పర్మినెంట్ కార్మికుల సంఖ్య 43 వేలకు పడిపోయింది. అదే టైంలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 18వేల నుంచి 30వేలకు పెరిగింది. అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 13వేల మంది పర్మినెంట్ కార్మికులు తగ్గిపోతే 12వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పెరిగారు. దీన్ని బట్టి సింగరేణిలో ప్రైవేటీకరణ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
మనయి వద్దు.. పక్కయి ముద్దు..
మంచిర్యాల జిల్లాలోని కల్యాణిఖని బ్లాక్ - 6, శ్రావణపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం బ్లాక్-3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్-3 ఓసీపీలను కోల్మినిస్ట్రీ ఆధ్వర్యంలో గత డిసెంబర్లో వేలం వేశారు. ఈ గనులన్నీ మనరాష్ట్రంలో అదీ సింగరేణి పరిధిలోనే ఉన్నప్పటికీ ఏ ఒక్కదానికి సింగరేణి టెండర్ వేయలేదు. మేనేజ్మెంట్పై రాష్ట్ర సర్కారు నుంచి ఉన్న ప్రెజరే ఇందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ నాలుగింట్లో కోయగూడెం కోల్‌బ్లాక్ కు మాత్రమే ఓ ప్రైవేట్ సంస్థ బిడ్ వేయగా, సింగిల్ టెండర్ కావడంతో క్యాన్సిల్చేశారు. ఇలా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బొగ్గు బ్లాకులను వద్దనుకున్న సింగరేణి, ఒడిశాలోని బొగ్గు గనుల కోసం మాత్రం వెంపర్లాడుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని నైని కోల్‌బ్లాక్ నుదక్కించుకోగా, దాని పక్కనే ఉన్న బంఖుయ్ కోల్‌బ్లాక్ కోసం మంగళవారం కోల్మినిస్ట్రీ నిర్వహించిన వేలంలో పాల్గొన్నది. ఇలా మనవాటిని వద్దనుకొని పొరుగురాష్ట్రాల్లో బొగ్గు బాయిలకు ఆరాటపడుతున్న సింగరేణి యాజమాన్యం తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
