సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్ ఇన్​చార్జ్ సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం

సింగరేణి నుంచి శ్రీధర్ ఔట్  ఇన్​చార్జ్ సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
  • జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీధర్​కు ఆదేశం
  • ఎక్స్​టెన్షన్లతో తొమ్మిదేండ్లపాటు ఏకఛత్రాధిపత్యం
  • ఆయన పనితీరుపై మొదటి నుంచి విమర్శలు

కోల్​బెల్ట్​/గోదావరిఖని/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణి సీఎండీ(చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) గా సుదీర్ఘ కాలం పనిచేసిన నడిమెట్ల శ్రీధర్ ఎట్టకేలకు ఆ పదవిని వీడాల్సి వచ్చింది.  ఆయన స్థానంలో  సింగరేణి ఫైనాన్స్​ డైరెక్టర్, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎన్. బలరాం నాయక్ కు ప్రభుత్వం సీఎండీగా ఫుల్ అడిషనల్ చార్జ్ అప్పగించింది. ఈ మేరకు మంగళవారం చీఫ్ సెక్రటరీ  శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

శ్రీధర్​ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకు 2015 జనవరి 1న సింగరేణి సీఎండీగా శ్రీధర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన రెండేండ్ల పాటు పదవిలో కొనసాగుతారని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. పదవీకాలాన్ని మొదట రెండుసార్లు రెండేండ్ల చొప్పున.. ఆ తర్వాత ఏటేటా పొడిగిస్తూ వచ్చింది. సింగరేణి సంస్థలో 1921 నుంచి 1934 వరకు 12 ఏండ్ల పాటు గోర్డెన్​ ప్రెసర్, 1940 నుంచి 1952 వరకు 12 ఏండ్ల పాటు సీవీఎస్ రావు సంస్థ చైర్​పర్సన్​గా వ్యవహరించారు. వారి తర్వాత ఎక్కువ కాలం పనిచేసిన రికార్డ్  శ్రీధర్ దే. బీఆర్ఎస్ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న శ్రీధర్ పదవీకాలాన్ని పొడిగించరాదని 2021లోనే కేంద్రం భావించింది. అప్పట్లో జరిగిన మీటింగ్​లో పదవీకాలం పొడిగింపును కోల్ మినిస్ట్రీ ప్రతినిధి అల్క శేఖర్ వ్యతిరేకించారు. కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లు, సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ మద్దతులో స్టేట్ గవర్నమెంట్ సాధారణ తీర్మానం ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ మెప్పు కోసం బొగ్గు, పవర్ అమ్మకాలకు సంబంధించి జెన్​కో, ట్రాన్స్ కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.29వేల కోట్ల బకాయిల విషయంలో ఆయన మెతకగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

సంస్థలో పెరిగిన రాజకీయ పెత్తనం

గతంలో సింగరేణికి సంబంధించిన ఏ నిర్ణయమైనా బోర్డు ఆఫ్ డైరెక్టర్ల మీటింగ్​లోనే తీసుకునేవారు. శ్రీధర్​ వచ్చాక సంస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. కోల్​బెల్ట్​ప్రాంతానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు సింగరేణిలో ప్రోటోకాల్ వర్తింపజేశారు. గతంలో సీఎంలు ఏటా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల లీడర్లను పిలిచి చర్చించి లాభాల్లో వాటా ప్రకటించేవారు. కేసీఆర్ మాత్రం ఎవరితో చర్చించకుండా తానే లాభాల్లో వాటాను ప్రకటిస్తూ వచ్చారు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేయాల్సిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్(డీఎంఎఫ్టీ), కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ(సీఎస్​ఆర్) ఫండ్ సుమారు రూ.3,500 కోట్లు ప్రభుత్వం తన ఖజానాకు మళ్లించింది. వాటిని కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు తరలించారు. కోల్​బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలకు ఏటా రూ.2 కోట్లు, రామగుండం మెడికల్ కాలేజ్​కు రూ.500 కోట్లు, భద్రాచలంలో గోదావరి పరివాహాక ప్రాంతంలో కరకట్ట నిర్మాణానికి రూ.1000 కోట్లు సింగరేణి ఫండ్స్ నుంచి కేటాయించడాన్ని కార్మిక సంఘాలు తప్పుపట్టాయి. సీఎండీ శ్రీధర్ కేసీఆర్​కు పూర్తి విధేయుడిగా ఉండడం వల్లనే సంస్థ నిధులను సర్కారు మళ్లించుకు వెళ్లిందన్న విమర్శలున్నాయి. గనుల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోయినా ఏనాడు సీఎండీ పట్టించుకోలేదు. అంతకు ముందున్న సీఎండీలు ఎక్కువగా కొత్తగూడెంలోని హెడ్​ఆఫీసులో ఉండేవారు. అవసరమైతేనే హైదరాబాద్​లోని సింగరేణి భవన్​కు వెళ్లేవారు. కానీ.. శ్రీధర్​మాత్రం సింగరేణి భవన్​నుంచే పనిచేశారు. వీడియో కాన్ఫరెన్స్​ల ద్వారా ఆదేశాలు జారీ చేసేవారు.

పెరిగిన అవినీతి, అక్రమాలు..

శ్రీధర్ హయాంలో సింగరేణిలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు పెరిగిపోయాయనే ఆరోపణలున్నాయి. శ్రీరాంపూర్, కోయగూడెం ఓసీపీల్లో రూ.వందల కోట్ల డీజిల్ కుంభకోణం, మెడికల్ అన్​ఫిట్ కేసుల్లో భారీగా వసూళ్లు చేసినా ఎవరిపైనా యాక్షన్ తీసుకోలేదు. ఇసుక ఫిల్లింగ్, బొగ్గు రవాణా, డీజిల్ వాడకం, సామాన్ల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలు జరిగాయి, స్ర్కాప్ కుంభకోణాల బాధ్యులకు చార్జ్​షీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఒడిశాలోని నైనీబ్లాక్, న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకుల కోసం రిటైర్డు జీఎంను సలహాదారుగా, మైనింగ్ అడ్వయిజర్, జైపూర్ ఏస్టీపీపీ, అటవీశాఖ, ఈఆర్పీ, లీగల్ అడ్వయిజర్లను నియమించి రూ.కోట్లల్లో దుబారా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో ఇటీవలే సింగరేణి సలహాదారులను బాధ్యతల నుంచి తొలగించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు శ్రీధర్ పదవీకాలన్ని పొడగించలేదు.

సింగరేణి ఇన్​చార్జ్ సీఎండీగా బలరామ్‌‌‌‌ నాయక్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టి ఎదిగిన ఎన్‌‌‌‌.బలరామ్‌‌‌‌ నాయక్‌‌‌‌ సింగరేణి సంస్థకు ఇనాచార్జ్​(పుల్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ చార్జ్) సీఎండీగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మహాబూబ్‌‌‌‌ నగర్‌‌‌‌ జిల్లా బాలానగర్‌‌‌‌ మండలం తిర్మలగిరి తండా బలరామ్‌‌‌‌ నాయక్‌‌‌‌ స్వగ్రామం. నాటి కరువు పరిస్థితుల్లో తల్లి దండ్రులు హైదరాబాద్‌‌‌‌కు వలస వెళ్లారు. ఆయన ఊర్లో అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంటర్‌‌‌‌ వరకు చదివాడు. సెలవు రోజుల్లో కూలీపనులకు వెళ్లేవాడు. డిస్టెన్స్‌‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఫ్రెండ్స్ రూమ్‌‌‌‌లలో ఉంటూ సివిల్స్‌‌‌‌పై దృష్టి పెట్టాడు. అదే సమయంలో యూజీసీ, నెట్‌‌ పరీక్షలు క్వాలిఫై అయ్యాడు. కొంతకాలం సీబీఐ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా పనిచేశాడు. 2010లో సివిల్స్‌‌‌‌కు ఎంపికయ్యాడు. ఐఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా మొదట మేడ్చల్‌‌‌‌ కస్టమ్స్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా పనిచేశాడు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో ఫైనాన్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఆయన్ను ప్రభుత్వం సింగరేణి సీఎండీగా (పుల్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ ఛార్జ్‌‌‌‌) నియమించింది.