వేధింపులు భరించలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

వేధింపులు భరించలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

పై అధికారుల వేధింపులు తాళలేక ఓ మహిళా కాంట్రాక్టు  ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లోజరిగింది. సింగరేణిలో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తున్న తాడూరి రాజేశ్వరి(35).. గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోకపోవడంతో సింగరేణి అతిథిగృహంలో తన విధులు నిర్వహిస్తూ వస్తోంది.

ఈరోజు ఉదయం గెస్ట్ హౌస్  అధికారులు అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి ట్రాక్టర్ తో పాటు వెళ్లి ఎండలో పని చేయవలసిందిగా ఆదేశించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తాను ఎండలో పని చెయ్యలేనని అధికారులకు తెలిపింది. అందుకు అధికారులు అనుమతించక ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిక్కు తోచని స్థితిలో మత్తు మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

తోటి ఉద్యోగులు వెంటనే అప్రమత్తమై ఆమెను కొత్తగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజేశ్వరి  చికిత్స పొందుతుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ  మహిళ కాంట్రాక్టు ఉద్యోగులపై అధికారుల వేధింపులు సరికాదని, మహిళా ఉద్యోగులకు ఆరోగ్యం సహకరించని సమయంలో సిక్ లీవ్ ను అధికారులు ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సింగరేణి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.