
కేవలం ఒక డ్రైవర్.. కానీ.. వసూళ్ల లెక్కలు చూస్తే డ్రైవర్ కు ఇదెలా సాధ్యం అని అవాక్కవ్వాల్సిందే. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేసిన డ్రైవర్ ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారుల అండతో భారీ వసూళ్లు చేసిన డ్రైవర్ మంగళవారం (మే 6) ఏసీబీకి చిక్కాడు. ఇతని వసూళ్ల చిట్టాను చూసి ఏసీబీ ఆఫీసర్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ అన్నె బోయిన రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేయడమే కాకుండా, సింగరేణి ఉద్యోగుల నుంచి కలెక్షన్లు చేసి దొరికిపోయాడు. ఉద్యోగులకు మెడికల్ అన్ ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని సుమారు 30 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. డ్రైవర్ తో పాటు మరి కొందరు బృందంగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెంలో రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.
సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్న అన్నె బోయిన రాజేశ్వరరావు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు. సింగరేణిలో ట్రాన్స్ ఫర్లు, మెడికల్ అన్ ఫిట్స్ చేయించేందుకు, సింగరేణి నోటిఫికేషన్ల సమయంలో అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మొత్తంలో వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు చెప్పారు. మొత్తం 32 లక్షల రూపాయలకు పైగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. రాజేశ్వరరావు వెనకాల మరికొందరు టీం గా ఏర్పడి ఇదంతా చేశారని, ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడే అవకాశం ఉందని తెలిపారు.