సింగరేణి ఎన్నికలు వాయిదా..డిసెంబర్ 27న నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

సింగరేణి ఎన్నికలు వాయిదా..డిసెంబర్ 27న నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
  • సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల సవరణ
  • నవంబర్ 30లోగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేయాలె
  • ఎన్నికల ప్రక్రియ మొత్తం మళ్లీ చేపట్టాలె
  • ఎన్నికలకు సహకరిస్తామంటూ రాష్ట్ర సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు 

హైదరాబాద్/కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను హైకోర్టు వాయిదా వేసింది. అక్టోబర్‌‌ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌‌ బెంచ్‌‌ సవరించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలను కొంతకాలం వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం అభ్యర్థించగా హైకోర్టు అంగీకరించింది. డిసెంబర్‌‌ 27న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. 

సింగరేణి యాజమాన్యం ఓటర్ల తుది జాబితాను నవంబర్‌‌ 30లోగా కేంద్ర కార్మిక శాఖకు అందజేయాలంది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్వీ శ్రవణ్‌‌కుమార్‌‌ లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట అక్టోబర్ లో ఎన్నికలు నిర్వహించాలని జూన్‌‌ 23న సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ ఉత్తర్వులను సవరించాలని సింగరేణి యాజమాన్యం మధ్యంతర పిటిషన్‌‌ వేసింది. దాన్ని సింగిల్‌‌ జడ్జి కొట్టేశారు. దీంతో సింగరేణి మేనేజ్ మెంట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేయగా, దానిపై డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారణ చేపట్టింది. 

పోలింగ్ రోజే ఫలితాలు ఇయ్యాలె.. 

గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్‌‌ విడుదల చేశామని హైకోర్టుకు కేంద్ర కార్మిక శాఖ తెలియజేసింది. నామినేషన్లు స్వీకరించామని, కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించామని తెలిపింది. దీనిపై స్పందించిన డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియ మొత్తం మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. ‘‘నామినేషన్లు, గుర్తుల కేటాయింపు తిరిగి చేపట్టాలి. ఇందుకోసం కేంద్ర డిప్యూటీ చీఫ్‌‌ లేబర్‌‌ కమిషనర్‌‌ చర్యలు తీసుకోవాలి. ఆ అధికారికి ఓటర్ల తుది జాబితాను సింగరేణి అందజేయాలి.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. మాకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి. గురువారంలోగా విద్యుత్‌‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ వేయాలి” అని ఆదేశించింది. పోలింగ్‌‌ జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించాలని సింగరేణికి ఆదేశాలిచ్చింది. 

ఇవీ వాదనలు.. 

సింగరేణి తరఫున సీనియర్‌‌ లాయర్‌‌ఆదిత్య వాదనలు వినిపించారు. ‘‘సింగరేణి పరిధిలోని 6 జిల్లాల్లో 43 వేల మంది కార్మికులు పోలింగ్‌‌లో పాల్గొంటారు. ఇందులో 3 జిల్లాల్లో నక్సల్స్‌‌ ప్రభావం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులంతా అసెంబ్లీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ టైమ్​లో సింగరేణి ఎన్నికలు నిర్వహించడం కష్టమవుతుంది” అని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్​ 30లోగా ఓటర్ల లిస్ట్‌‌ అందజేస్తామని, డిసెంబర్​ మూడో వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇంకోసారి ఎన్నికల వాయిదా కోరబోమని రాష్ట్ర సర్కార్ తరఫున అదనపు అడ్వొకేట్‌‌ జనరల్‌‌ రామచంద్రరావు హామీ ఇచ్చారు.

దీనిపై విద్యుత్‌‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌‌ దాఖలు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ హామీకి అనుగుణంగా నవంబర్​ 30లోగా ఓటర్ల లిస్ట్‌‌ అందజేసేలా ఆదేశాలివ్వాలని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌‌ జనరల్‌‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సాకుతో సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తోందని కార్మిక సంఘాల తరఫు లాయర్ అన్నారు. ఇలాగే హామీలిస్తూ రెండేండ్లుగా వాయిదాలు కోరుతోందన్నారు. వాదనలు విన్న కోర్టు..  అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. విచారణను డిసెంబర్‌‌ 29కి వాయిదా వేసింది. 

బీఆర్ఎస్ అభ్యర్థులకు ఊరట.. 

ఆరు జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో సింగరేణి ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం ఉండగా.. వాటిని హైకోర్టు వాయిదా వేయడంతో బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఊపిరి పీల్చుకున్నారు. బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ​యూనియన్​పై కార్మికుల్లో ఉన్న వ్యతిరేకత సింగరేణి ఎన్నికల్లో బయటపడితే.. అది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అధికార పార్టీ అభ్యర్థులు ఇన్ని రోజులుగా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే సింగరేణి ఎన్నికలు జరగనుండడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాది కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, పినపాక నియోజకవర్గాల్లో బొగ్గు గనులు ఉన్నాయి.