V6 News

సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీ దాకా.. పాలిటిక్స్ లో చక్రం తిప్పిన సింగరేణి కార్మికులు

సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీ దాకా.. పాలిటిక్స్ లో చక్రం తిప్పిన సింగరేణి కార్మికులు
  • కార్మిక సంఘాల్లోనూ రాష్ట్ర, 
  • జాతీయ స్థాయిలో కీ రోల్  
  • గ్రామాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి కృషి 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. సర్పంచ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగానే కాకుండా మంత్రి పదవులు సైతం చేపట్టారు. ఉద్యోగ, కార్మిక సంఘాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. కొందరు జాతీయస్థాయి పదవుల్లో ఉన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం, మౌలిక వసతుల కల్పనకు తమ వంతుగా కృషి చేశారు. ప్రభుత్వ నిధులతో పాటు సింగరేణి సీఎస్సాఆర్​నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లోంచి సర్పంచులుగా ఎదిగిన సింగరేణి ఉద్యోగులు రాష్ట్ర, జాతీయ స్థాయి లీడర్లుగానూ గుర్తింపు పొందారు. 

 మరికొందరు ఉద్యోగులు సర్పంచులుగా.. 

రామకృష్ణాపూర్​ఎంకే --4 గనిలో క్లర్కు అయిన  గురిజాల రవీందర్ రావు రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షుడు, తెలంగాణ జన సమితిలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2001లో క్యాతనపల్లి సర్పంచ్​ అయ్యారు. మంచిర్యాల జిల్లాకు చెందిన సింగరేణి ఉద్యోగులు అచ్యుత్​రావు (క్యాతనపల్లి), కమల మనోహర్​(సారంగపల్లి), మద్ది రాంచందర్​(మందమర్రి), గద్దె రాంరెడ్డి (భీమారం) సర్పంచులుగా చేశారు. బెల్లంపల్లి టౌన్ కు చెందిన ఏఐటీయూసీ సీనియర్​నేత, మాజీ సింగరేణి ఉద్యోగి చిప్ప నర్సయ్య(చంద్రవెల్లి), సంగీతరావు (కొత్తపల్లి), మొండ గౌడ్​(బూదకలాన్), కొమ్మెర లక్ష్మణ్ (చంద్రవెళ్లి), సాలిగాం బానయ్య (తాండూరు), బుర్సా భీమయ్య (బూదకలాన్), దుర్గం రాజేశ్వర్​(బట్వాన్​పల్లి), రాంరెడ్డి (ఆకినపల్లి), బొలిశెట్టి శంకర్(​పెరకపల్లి), మర్రి రామస్వామి (తాండూరు), సతా బాణయ్య (కాసీపేట), మూల మల్లగౌడ్​(ఆకుంశం),రంగు మల్లాగౌడ్​ (తాళ్ల గురిజాల) సర్పంచ్ లు అయ్యారు. 

మంచిర్యాల సెగ్మెంట్ పరిధి శ్రీరాంపూర్​ఏరియాకు చెందిన సింగరేణి ఉద్యోగులు గోపు రాజయ్య, గుంట జగ్గయ్య( సింగపూర్ ), పి.నర్సయ్య, గొట్టం తిరుపతి రెడ్డి, జక్కుల రాజేశం(తాళ్లపల్లి) సర్పంచులుగా చేశారు. మరికొందరు ఉప సర్పంచులు అయ్యారు. పలువురు సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు వివిధ జిల్లాల్లో సర్పంచులు కొనసాగారు.

వరుసగా 37 ఏండ్ల పాటు సర్పంచ్​గా.. 

మంచిర్యాల జిల్లా కాసీపేట మండల కేంద్రానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి బన్న ఆశాలు దశాబ్దాల పాటు సర్పంచ్​గా సేవలందించారు.  మందమర్రి ఏరియా సోమగూడెం -1 గనిలో షాట్​ఫైరర్​గా చేరారు. ఓ వైపు డ్యూటీ చేస్తూనే  1976 - 2003 వరకు కాసీపేట మేజర్​ పంచాయతీ సర్పంచ్​గా చేశారు.  కరెంటు సౌకర్యం, స్కూల్, కాలేజ్, పంచాయతీ ఆఫీస్​,లైబరీ వంటి సౌలత్​లను కల్పించారు. ఐఎన్టీయూసీ, సాజక్​ కార్మిక సంఘాల్లోనూ కీలక బాధ్యతల్లో కొనసాగారు.

సర్పంచ్​ నుంచి ఎమ్మెల్సీగా.. 

రామకృష్ణాపూర్​ ఏరియా ఆర్కే- 2 గనిలో డిస్పెన్సరీ క్లర్క్​ బి.వెంకట్రావు క్యాతనపల్లి మేజర్ పంచాయతీ తొలి సర్పంచ్​గా 1972 -1984 వరకు కొనసాగారు.  కార్మికనేతగానూ 1980లో ఐఎన్టీయూసీకి అనుబంధ తాండూరు కోల్​మైన్స్​లేబర్​యూనియన్​ను నాగయ్యరెడ్డితో కలిసి స్థాపించారు. కొన్నేండ్లపాటు యూనియన్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు. జేబీసీసీఐ వేజ్​బోర్డు సభ్యుడిగానూ సేవలందించారు.  గని కార్మికుల భవిష్య నిధి(సీఎంపీఎఫ్​) ట్రస్టు బోర్డు సభ్యుడిగా ఉన్నారు. కార్మిక రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా గవర్నర్‌ ‌కోటా కింద 2009లో ఎమ్మెల్సీ అయ్యారు. కొంతకాలం బీఆర్ఎస్​ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రెసిడెంట్​గా చేశారు.

క్లర్కు నుంచి జాతీయ నేతగా..  

సింగరేణి కాలరీస్​ వర్కర్స్​యూనియన్​స్టేట్​ ప్రెసిడెంట్​ వాసిరెడ్డి సీతారామయ్య రామకృష్ణాపూర్ - ఆర్కే1ఏ గనిలో క్లర్కు. కాగా..1996లో క్యాతనపల్లి మేనేజర్​ పంచాయతీ సర్పంచ్​గా ఎన్నికయ్యారు. బస్టాండ్, పంచాయతీ ఆఫీస్, లైబరీ,​ క్యాతనపల్లి- మంచిర్యాల ప్రధాన రోడ్డు, సింగరేణి కార్మికవాడల్లో వాటర్​పైపులైన్ల వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. 2006  నుంచి సింగరేణి జేబీసీసీఐ శాశ్వత సభ్యుడిగా ఉన్నారు.  కార్మిక సంఘంలోనూ, ప్రజా సమస్యలపైనా పోరాటాలు చేస్తూ పేరుపొందారు. ఆయన సతీమణి ఝూన్సీరాణి కూడా సర్పంచ్​గా చేశారు. 

తొలితరం కార్మిక నేత.. తొలి ఉప సర్పంచ్  

సింగరేణిలో తొలితరం కార్మికనేతగా, రామకృష్ణాపూర్​ ఏరియా వర్క్​షాప్​లో టెండల్ కార్మికుడైన జాడి దుర్గయ్య గుర్తింపు పొందారు. 1972లో క్యాతనపల్లి మేజర్​పంచాయతీ తొలి ఉప సర్పంచ్​గా చేశారు. జాతీయ స్థాయిలో దళితనేతగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో బొగ్గు పరిశ్రమల కార్మికుల వేజ్​బోర్డు సభ్యుడిగా కొనసాగారు. 5,6 వేతన ఒప్పందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. సింగరేణి హెచ్ఎంఎస్ సంఘం (సింగరేణి ఇంజనీరింగ్ మైనర్స్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌) వ్యవస్థాపకులు కూడా.