ఇయ్యాల్నే సింగరేణి అధికారుల సంఘం ఎన్నికలు

ఇయ్యాల్నే సింగరేణి అధికారుల సంఘం ఎన్నికలు
  •     12 ఏరియాల్లో రహస్య బ్యాలెట్ ​పద్ధతిలో పోలింగ్
  •     అధ్యక్ష బరిలో ఆరుగురు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు సంబంధించిన కోల్​మైన్స్​ఆఫీసర్స్​అసోసియేషన్​ఆఫ్​ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సింగరేణి వ్యాప్తంగా12 ఏరియాల్లో సీక్రెట్​ బ్యాలెట్​పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 2,300 మంది అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బెల్లంపల్లి రీజియన్​మందమర్రి ఏరియాలోని ఇల్లందు క్లబ్​ యోగా కేంద్రం, శ్రీరాంపూర్​ఏరియాలోని సీసీసీ సింగరేణి ఎస్​సీఏఓ క్లబ్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఆఫీస్​ క్లబ్​లో పోలింగ్ ​కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు కార్పొరేట్​ సేఫ్టీ జీఎం కె.గురువయ్య ఛీప్​ ఎలక్షన్ ఆఫీసర్​గా వ్యవహరిస్తున్నారు. 30 ఏండ్ల తర్వాత సింగరేణిలో ప్రత్యక్ష పద్ధతితో పోలింగ్​జరగడం ఇదే మొదటిసారి. రెండు ఓట్ల పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డివిజన్​ వారీగా ఒక ఓటు, సింగరేణి స్థాయిలో మరో ఓటు వేయాల్సి ఉంటుంది. సోమ, మంగళవారాల్లో ఓట్లు లెక్కించి, ఫలితాలను వెల్లడించనున్నారు.

శ్రీరాంపూర్​ డీవైజీఎం గోపాల్​సింగ్, అనుముల వెంకటేశ్వర్ ​రెడ్డి, ఓసీపీ-3 ఏజీఎం ఎన్.రాధాకృష్ణ, కొత్తగూడెం కిష్టారం గని ఇంజనీర్​ గడిపల్లి కృష్ణప్రసాద్, మణుగూరు పీకే ఓసీపీ డీవైజీఎం లక్ష్మిపతి గౌడ్, కొత్తగూడెం పీవీకే గని డీవైజీఎం పాలడుగు శ్రీనివాస్ అధ్యక్ష బరిలో నిలిచారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల  అధికారి గురువయ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్​ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.