
- హైదరాబాద్‌లో150 నుంచి 200 బెడ్స్‌తో ఏర్పాటుకు చర్యలు
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాస్పిటల్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఆసక్తి గల వ్యక్తులు, సంస్థల నుంచి ఆహ్వానాలు కోరుతూ సింగరేణి యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా ఏడు ఏరియా హాస్పిటల్స్‌తో పాటు డిస్పెన్సరీల ద్వారా సుమారు 42 వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ట్రీట్‌మెంట్ అందుతోంది. మరోవైపు కార్పొరేట్ వైద్య సేవల కోసం యాజమాన్యం ఏటా సుమారు రూ.150 కోట్లపైగా ఖర్చు చేస్తోంది. అయితే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కార్మికులు, కార్మిక సంఘాలు ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తుండడంతో ఆ దిశగా సింగరేణి యాజమాన్యం దృష్టి సారించింది.
సీఎండీ బలరాంనాయక్, డైరెక్టర్లు, సీఎంవో కిరణ్ రాజ్‌కుమార్ తదితరులు సింగరేణి వ్యాప్తంగా ఏరియా హాస్పిటల్స్, డిస్పెన్సరీల్లో పర్యటించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవల అవసరాన్ని పరిశీలించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ స్థాయి హాస్పిటల్ ఏర్పాటుపై యాజమాన్యం దృష్టి సారించింది. ఆసుపత్రి ఏర్పాటుకు ఆసక్తి గల సంస్థలు, వ్యక్తులు, పార్టీల నుంచి సహకారం తీసుకోవడం కోసం ఆహ్వానాలు కోరింది. ఇందులో భాగంగా లోకేషన్, ల్యాండ్, బిల్డింగ్ ప్లాన్, స్ర్టక్చర్ లేఅవుట్, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్‌మెంట్, మ్యాన్‌పవర్, ఎన్‌వోసీ వంటి అంశాలతో ఈ నెల 12లోపు వివరాలు పంపించాలని కోరింది.