సింగరేణిలో ఎన్నికలు ఆపేందుకు సర్కారు యత్నం?

సింగరేణిలో ఎన్నికలు ఆపేందుకు  సర్కారు యత్నం?
  • ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని కలెక్టర్లతో  కేంద్ర కార్మిక శాఖకు లేఖలు 
  • బీఆర్​ఎస్​కు ఓటమి భయం పట్టుకుందని కార్మిక సంఘాల ఎద్దేవా

భద్రాద్రి కొత్తగూడెం,  వెలుగు:  సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేసేందుకు రాష్ట్ర సర్కారు సీరియస్​గా ప్రయత్నిస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని గతేడాది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ దిశగా కొంత కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల అసిస్టెంట్​ లేబర్​ కమిషనర్​ ఆధ్వర్యంలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్చలు కొలిక్కివచ్చాయి. ఆగస్టులో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో బీఆర్​ఎస్​ సర్కారు ఒక్కసారిగా అలర్ట్​ అయింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, అంతకుముందు జరిగే సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్​ ఓడిపోతే  కోల్​బెల్ట్​లో బీఆర్ఎస్​కు మైనస్​ అవుతుందని సర్కారు ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు తాము రెడీగా లేమని కలెక్టర్లతో కేంద్ర కార్మిక శాఖకు లెటర్లు రాయిస్తున్నట్లు తెలిసింది. 

త్వరలోనే షెడ్యూల్​ వస్తుందని భావించినా.. 

ఉమ్మడి ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో  విస్తరించిన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తారు. ప్రధాన పార్టీలకు చెందిన అనుబంధ కార్మిక సంఘాలన్నీ బరిలో ఉండడం, అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆయా పార్టీలన్నీ ఎన్నికలను చాలెంజింగ్​​గా తీసుకుంటాయి.  చివరిసారి 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అనుబంధ టీబీజీకేఎస్​విజయం సాధించింది.  రెండేండ్ల పీరియడ్​పై గెలిచిన టీబీజీకేఎస్​గతంలో మాదిరి నాలుగేండ్ల పీరియడ్​ కోసం హైకోర్టును ఆశ్రయించింది.  ఆ పరిమితి కూడా 2021తో ముగిసింది. తర్వాత రెండేండ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గతేడాది అక్టోబర్​ 28న ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో ఎలక్షన్స్​పై కదలిక మొదలైంది. నవంబర్​ 29న మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యానికి కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్​ శ్రీనివాసులు లేఖ రాశారు. ఈ క్రమంలో అసిస్టెంట్​ లేబర్​ కమిషనర్​ ఆధ్వర్యంలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి.  గతేడాది డిసెంబర్​, జనవరి నెలల్లోఎన్నికలు జరుగుతాయని భావించినా కోల్​ ప్రొడక్షన్​కు విఘాతం కలుగుతుందనే సాకుతో యాజమాన్యం అడ్డుకుంది.  ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదరాబాద్​లో యాజమాన్యం, కార్మిక సంఘాలతో కేంద్ర కార్మిక శాఖ ప్రత్యేక మీటింగ్​నిర్వహించింది.  ఈ నెల 24న మరోసారి సమావేశమై అదేరోజు ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేస్తామని, ఆగస్టులో ఎన్నికలు ఉండే చాన్స్​ ఉందని ఆఫీసర్లు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. 

ఎన్నికలకు రెడీగా లేమంటూ కలెక్టర్లతో లేఖలు.. 

ఉమ్మడి ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి 11 ఏరియాల్లో దాదాపు 42వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.  కాగా, ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్​ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యంగా కోల్​బెల్ట్​నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంక్షేమం మరిచారని,  సింగరేణి నిధులను దారి మళ్లిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్​కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందని సర్కారు భావిస్తోంది.  ఈ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడే ప్రమాదముందని భయపడ్తోంది. ఈ క్రమంలోనే కోల్​బెల్ట్​ పరిధిలోని కలెక్టర్లతో తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని లెటర్లు ఇప్పిస్తున్నట్లుతెలిసింది. కొత్తగూడెం కలెక్టర్ ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖకు లేఖరాసినట్లు కార్మిక సంఘాల్లో చర్చ జరుగుతోంది.