- అవార్డు అందుకున్న సంస్థ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) అవార్డు లభించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్(ఈఈఎఫ్) వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించే సంస్థలకు ఇచ్చే గ్లోబల్ సీఎస్ఆర్ పురస్కారం ఈసారి సింగరేణికి అందించింది. గురువారం వర్చువల్‌గా నిర్వహించిన 12వ అంతర్జాతీయ పెట్రో కోల్ సదస్సు-2022లో సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్ ఈ అవార్డును హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆన్‌లైన్‌లో అందుకున్నారు. సింగరేణి కాలరీస్ గత కొన్నేండ్లుగా చేపట్టిన సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ప్లాటినమ్ విభాగంలో ఫస్ట్ ఫ్రైజ్‌ను అందజేసింది. సింగరేణి సీఎస్‌ఆర్‌తో పాటు జిల్లాల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.2,500 కోట్లకు పైగా డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను జమ చేసిందని ఎన్.బలరామ్ తెలిపారు. దక్షిణ భారత ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని ఈఈఎఫ్ సంస్థ సీఈవో డాక్టర్ అనిల్ కుమార్ గార్గ్ కొనియాడారు. గత 13 దశాబ్దాలుగా బొగ్గు రంగంలో సింగరేణి సంస్థ అంకితభావంతో సేవలందించడమే కాకుండా, సమీప గ్రామాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏటా కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులను ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. గ్లోబల్ సీఎస్ఆర్, గ్లోబల్ సేఫ్టీ, గ్లోబ ల్ హెచ్ఆర్ తదితర 5 కేటగిరీల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
