మారుపేర్లను సవరించాలని ఆందోళన

మారుపేర్లను సవరించాలని ఆందోళన

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణిలో మారుపేర్లను సవరించి తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కార్మికులు, వారి వారసులు నిరసనకు దిగారు. మందమర్రి మండలం క్యాతనపల్లి ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం సింగరేణి స్థాయి రక్షణ త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కార్మికులు, వారి వారసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మారుపేర్లను సవరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను సింగరేణి సిఎండీ, డైరెక్టర్లు, డీజీఎంఎస్ దృష్టికి తీసుకెళ్లారు. 

వారసులు మాట్లాడుతూ.. మారుపేర్లు అంటూ విజిలెన్స్ ఎంక్వయిరీ పేరుతో ఏండ్లుగా తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. తమ తండ్రుల ఉద్యోగాలు వస్తాయని ఏండ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు. ఉద్యోగాల కల్పినపై రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పందించిన  సీఎండీ బలరాంనాయక్ సమస్య పరిష్కారం కోసం చర్చిస్తామని హామీతో ఆందోళన విరమించారు.