సింగరేణికి మణుగూరు టెన్షన్‌‌‌‌‌‌‌‌.. క్వాలిటీ బొగ్గు దొరికే పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌ను వేలంలో పెట్టిన కేంద్రం

 సింగరేణికి మణుగూరు టెన్షన్‌‌‌‌‌‌‌‌..  క్వాలిటీ బొగ్గు దొరికే పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌ను వేలంలో పెట్టిన కేంద్రం
  • గని కోసం వేలంలో పాల్గొంటున్న సింగరేణి, జెన్‌‌‌‌‌‌‌‌కో
  • మైన్‌‌‌‌‌‌‌‌ దక్కకుంటే ప్రశ్నార్థకంగా మణుగూరు ఏరియా భవిష్యత్‌‌‌‌‌‌‌‌
  • కీలక మైన్‌‌‌‌‌‌‌‌ను వేలంలో పెట్టడంతో కేంద్రంపై సింగరేణి కార్మికుల ఆగ్రహం 
  • ఆందోళనలకు సిద్ధమవుతున్న యూనియన్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కోల్‌‌‌‌‌‌‌‌ మైన్స్‌‌‌‌‌‌‌‌లో అత్యంత కీలకమైన మణుగూరు గనిని కేంద్రం వేలానికి పెట్టడంతో సింగరేణికి టెన్షన్‌‌‌‌‌‌‌‌ పట్టుకుంది. క్వాలిటీ బొగ్గుతో సింగరేణికి లాభాలు తీసుకురావడంలో సత్తుపల్లితో పాటు మణుగూరు ఏరియాలు కీలకపాత్ర వహిస్తున్నాయి. మణుగూరు ఏరియాలో ప్రస్తుతం కొండాపూర్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌తో పాటు పీకే ఓసీ, మణుగూరు ఓసీలు ఉన్నాయి. ఈ మైన్స్‌‌‌‌‌‌‌‌లలో మరో నాలుగేండ్లలో బొగ్గు నిల్వలు పూర్తిగా ఖాళీ కానున్నాయి. దీంతో మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌తో మరో 20 ఏండ్ల వరకు ఢోకా ఉండదని అంతా భావించారు. 

కానీ ఈ మైన్‌‌‌‌‌‌‌‌ను వేలం వేస్తున్నట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఈ గనిని సొంతం చేసుకునేందుకు సింగరేణి సంస్థ తొలిసారిగా వేలంలో పాల్గొంటోంది. ఈ మైన్‌‌‌‌‌‌‌‌ గనుక సింగరేణికి దక్కకపోతే మరో నాలుగేండ్లలో మణుగూరు ఏరియా భవిష్యత్‌‌‌‌‌‌‌‌ ప్రమాదంలో పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సింగరేణి వర్సెస్‌‌‌‌‌‌‌‌ జెన్‌‌‌‌‌‌‌‌కో

దేశంలోని పలు బొగ్గు బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 41 కోల్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌లకు వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌ ఒక్కటే వేలానికి వచ్చింది. సుమారు రెండు దశాబ్దాల జీవిత కాలం ఉన్న ఈ మైన్‌‌‌‌‌‌‌‌ను సొతం చేసుకునందుకు ఓ వైపు సింగరేణి, మరో వైపు తెలంగాణ జెన్‌‌‌‌‌‌‌‌కో సంస్థలు పోటీ పడుతున్నాయి. 

ఒకే మైన్‌‌‌‌‌‌‌‌ కోసం ఒకే రాష్ట్రానికి చెందిన రెండు ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణికి అత్యంత కీలకమైన ఈ మైన్‌‌‌‌‌‌‌‌ కోసం జెన్‌‌‌‌‌‌‌‌కో పోటీ పడడం పట్ల సింగరేణి కార్మికులు, యూనియన్‌‌‌‌‌‌‌‌ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 

వేలంలో పాల్గొనేందుకు సర్కార్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌

తెలంగాణలోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీతో పాటు శ్రావణపల్లి ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌లను కేంద్రం గతంలోనే వేలం వేసింది. అప్పుడు సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకుండా అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో ఆ రెండు గనులను ఇతర సంస్థలు దక్కించుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఒకే మైన్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం వేలంలో పెట్టడం, దానిని దక్కించుకోవడం సింగరేణికి తప్పనిసరి కావడంతో ఈ విషయాన్ని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆఫీసర్లు, సింగరేణి యాజమాన్యంతో చర్చించారు. అనంతరం సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనేందుకు ప్రభుత్వం గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీంతో సింగరేణి సంస్థ మణుగూరు మైన్స్‌‌‌‌‌‌‌‌ కోసం టెండర్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్స్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసి బిడ్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది.

 ఆందోళనకు సిద్ధమవుతున్న యూనియన్లు

తెలంగాణలో అనేక బొగ్గు బ్లాకులు ఉన్నప్పటికీ సింగరేణికి లాభాలు తీసుకొచ్చే మణుగూరు పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం వేలంలో పెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిచర్ల 2, చెన్నూర్‌‌‌‌‌‌‌‌ వంటి వాటితో పాటు ఇతర బ్లాక్‌‌‌‌‌‌‌‌లను వేలంలో పెట్టకుండా.. కేవలం మణుగూరుపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేయడం వెనుక కుట్ర ఉందని సింగరేణి కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ మైన్‌‌‌‌‌‌‌‌ను ఆదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

మణుగూరు ఏరియాలోని పీకే ఓసీ డీప్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ మైన్‌‌‌‌‌‌‌‌ను వేలంలో పెట్టడాన్ని నిరసిస్తూ సింగరేణిలోని బీఎంఎస్​ మినహా మిగిలిన అన్ని కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సింగరేణి పరిరక్షణ కమిటీ పేరుతో భవిష్యత్‌‌‌‌‌‌‌‌ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, సీపీఐ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుపుకొని ఉద్యమం చేపట్టేందుకు యూనియన్లు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.