అనుకోకుండా సింగర్​ అయ్యా

అనుకోకుండా సింగర్​ అయ్యా

అమలా చేబోలు.. మ్యూజిక్​ ఇండస్ట్రీలో  ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పాడింది కొన్ని పాటలే అయినా సోషల్​ మీడియాలో బోలెడంత క్రేజ్​ తెచ్చుకుంది.​ రీసెంట్​గా‘ వరుడు కావలెను’ సినిమాలోని ‘వాట్​ టు డు’ పాటతో ఇండస్ట్రీలోనూ హాట్​ టాపిక్​ అయింది. వరుస హిట్స్​ కొడుతున్న  ఈ  యంగ్​ సింగర్​​ ఐటీ ప్రొఫెషనల్​​ కూడా. ఒక వైపు తనకిష్టమైన పాటల్ని పాడుతూనే అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. ‘ప్యాషన్​, ప్రొఫెషన్​ రెండింటినీ బ్యాలెన్స్​ చేయడం కష్టం అనిపించట్లేదా?’ అని అడిగితే ... ‘అమ్మ కడుపులోనే నాకు పాట పరిచయం అయింది’ అంటోంది.

ప్యాషన్​?  ప్రొఫెషన్​?  ఏది ముఖ్యమంటే.. ఎవరైనా రెండింట్లో  ఏదో ఒక దారిని ఎంచుకుంటారు. అందులోనూ అతికొద్దిమందే అనుకున్న గమ్యం చేరతారు. కానీ, అమల మాత్రం నాకు పాటంటే ఎంత ఇష్టమో.. చదువన్నా అంతే ప్రేమ అంటుంది. అందుకే చిన్నప్పట్నించీ మ్యూజిక్​తో పాటు చదువులోనూ ముందే ఉంది. అనుకున్నట్టే రెండింటిలోనూ సక్సెస్​ అయింది. ప్లే బ్యాక్ సింగర్​గా  అవకాశాలు అందుకుంటూనే.. ప్రొఫెషనల్​ లైఫ్​లో  రాణిస్తున్నానంటే  మా ఫ్యామిలీ సపోర్టే కారణం అంటోంది.

‘‘అమ్మ సరస్వతికి సంగీతమంటే చాలా ఇష్టం. బాగా పాడుతుంది. వీణ కూడా వాయిస్తుంది. మా చిన్నప్పుడు శాస్ర్తీయ సంగీతంలో కచేరీలు కూడా చేసేది. అలా అమ్మ కడుపులోనే నాకు, అక్కకి పాట పరిచయమైందనుకుంటా. నా మూడేళ్ల వయసులోనే అమ్మ పాడుతుంటే కూనిరాగాలు తీసేదాన్నట. అది గమనించి సరిగమల్లో ఓనమాలు దిద్దించింది అమ్మ. ఆరేళ్లు వచ్చేసరికి శృతులు, గమకాల్లో బేసిక్స్​ అన్నీ నేర్పించింది. అలా నేర్పడంతో ఆరేళ్లకే మా అక్కతో కలిసి టీటీడీ ఆస్థాన మండపంలో  కచేరీ చేశా. చుట్టు పక్కల ఏ సభ జరిగినా అక్కతో కలిసి వెళ్లి పాడేదాన్ని. కాంపిటిషన్స్​లోనూ బోలెడు ప్రైజ్​లు గెలుచుకున్నా. 

అవన్నీ చూసి అమ్మానాన్న నన్ను మ్యూజిక్​ వైపు ఎంకరేజ్​ చేశారు. డాక్టర్ పంతులు రమ దగ్గర క్లాసికల్​ మ్యూజిక్​లో చేర్పించారు. దాదాపు ఇరవైయ్యేళ్లు అక్కడే కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. అయితే మ్యూజిక్ క్లాస్​లు​, స్టేజ్​ షోలతో ఎంత బిజీ ఉన్నా  చదువుని నిర్లక్ష్యం చేయలేదు. దానికి కారణం మా నాన్న డాక్టర్ గోపాల కృష్ణ మూర్తి. నాన్న డిగ్రీ కాలేజీలో ఎకనమిక్స్​ డిపార్ట్​మెంట్​కి హెచ్​ఓడీగా పనిచేసేవాళ్లు. దాంతో చదువు విలువని, కెరీర్​ ఇంపార్టెన్స్‌‌ని ఎప్పుడూ గుర్తు చేస్తుండేవారు. అందుకే మ్యూజిక్​తో పాటు చదువుకీ ఇంపార్టెన్స్​ ఇచ్చా. మ్యూజిక్​లో సర్టిఫికెట్​, డిప్లొమా చేస్తూనే బీటెక్​ చదివా. అయితే, సినిమాల్లో పాడాలన్న ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు నాకు. 

రేడియో వింటూ సినిమా పాటలు.. 
క్లాసికల్​ మ్యూజిక్​ నుంచి పక్కకి రాకూడదని  టీవీ కొనలేదు అమ్మానాన్న. దాంతో చిన్నప్పుడు పాటలు వినాలంటే రేడియో తప్పించి మరో  ఆప్షన్​ ఉండేది కాదు. అందులోనూ రేడియోలో ఎక్కువగా కచేరీలు, ఓల్డ్​ సాంగ్సే వచ్చేవి. కానీ, ప్రైవేట్​ ఎఫ్​.ఎమ్​లు వచ్చాక కొత్త సినిమా పాటలన్నీ పరిచయమయ్యాయి. ‘నువ్వు నాకు నచ్చావ్​’, ‘జల్సా’, ‘పరుగు’ లాంటి హిట్​ ఆల్బమ్స్ చాలా అట్రాక్ట్​ చేశాయి నన్ను. అలాంటి పాటలు పాడాలన్న డ్రీమ్​ మొదలైంది. దాంతో రెగ్యులర్​గా సినిమా పాటలు విన్నా. ప్రాక్టీస్​ చేశా. అయితే అప్పటికే క్లాసికల్​ మ్యూజిక్​లో నాకు మంచి పేరు రావడంతో పెద్దగా ట్రై చేయకుండానే సినిమా అవకాశాలు వచ్చాయి. మొదటిసారి బీటెక్ ఫైనల్ ఇయర్​లో ‘విక్రమార్కుడి లవ్ స్టోరీ’ సినిమాలో ‘మెరుపు తీగ’ అనే పాట పాడా. కానీ, దానికంటే ముందే నేను ఆ తర్వాత పాడిన ‘మాయ’ సినిమాలోని ‘ కలయేదో..నిజమేదో’ పాట రిలీజ్​ అయింది. ఆ సాంగ్​ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నాకు. యునిక్​ వాయిస్​ అని మెచ్చుకున్నారు. అవకాశాలూ పెరిగాయి. 

అమెరికాలో రికార్డింగ్​
ఆ పాట రిలీజ్​ అయ్యాక వరుసగా అవకాశాలు వచ్చాయి నాకు. అయితే, రికార్డింగ్స్ కోసం వైజాగ్​ టు హైదరాబాద్​ తిరగడం ఇబ్బంది అయింది. దాంతో హైదరాబాద్​ షిఫ్ట్​ అయ్యా. కానీ, హోంసిక్​ వల్ల నెలకే మళ్లీ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లా. ఆ లోపే అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడికెళ్లాక కూడా మ్యూజిక్​ పక్కన పెట్టలేదు. టీమ్​ లీడ్​గా ఉద్యోగం చేస్తూనే  తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠి భాషల్లో యాడ్స్​కి జింగిల్స్​ పాడా. కొన్ని ఇంగ్లీష్​​ షార్ట్​ఫిల్మ్స్​ కోసం కూడా పాడా. మరికొన్ని  తెలుగు సినిమాలకి సాంగ్స్​ రికార్డ్​ చేసి పంపేదాన్ని. అలా నేను పాడిన ‘జోహార్’​సినిమాలోని ‘నీ రూపం ఎదురుగా ’ పాట మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది నాకు. ఆ తర్వాత కొవిడ్​ వల్ల ఇండియా వచ్చేశా. ప్రస్తుతం వర్క్​ ఫ్రమ్​ హోం చేస్తూనే ప్లే బ్యాక్ సింగింగ్‌‌ కెరీర్​ని బ్యాలెన్స్​ చేస్తున్నా.

మాస్​ మొదటిసారి
చాలా గ్యాప్​ తర్వాత హైదరాబాద్​ వచ్చా. దాంతో ప్లే బ్యాక్ విషయంలో కొంచెం టెన్షన్​ పడ్డా. ఆ టైంలో నా వాయిస్​ని నమ్మి  మ్యూజిక్​ డైరక్టర్​ సాగర్ మహతి ‘భీష్మ’లో అవకాశం ఇచ్చారు. ‘వాట్టే వాట్టే బ్యూటీ’  సాంగ్ పాడించారు. మొదట ఆ పాట పాడింది నేను అంటే ఎవరూ నమ్మలేదు. అప్పటివరకు నేను మాస్​ పాటలు ట్రై చేయలేదు. ఎవరైనా సరదాగా పాడమని అడిగినా ‘నో’ అనేదాన్ని. మాస్​ పాటలంటే కొంచెం ఇబ్బంది ఫీలయ్యేదాన్ని కూడా. దాంతో భీష్మలో ‘ వాట్టే వాట్టే బ్యూటీ’ పాడే సరికి అందరూ షాక్​ అయ్యారు. నిజానికి మెలోడి అనే నన్ను స్టూడియోకి పిలిపించారు సాగర్​ గారు. అక్కడికెళ్లాక, ఈ పాట ఇచ్చి పాడమన్నారు. దాంతో  మొదట ‘నా వల్ల కాద’ని చెప్పా. అయితే, ఆ పాటని నాకన్నా ముందు పెద్దపెద్ద సింగర్స్​తో పాడించారు. వాళ్లందర్నీ దాటుకుని నా వెర్షన్​ ఫైనల్​ అయింది. దాంతో నేను మాస్​ పాటలు కూడా  పాడగలనన్న కాన్ఫిడెన్స్​ వచ్చింది. రీసెంట్​గా ‘వరుడు కావలెను’ లో పాడిన ‘ వాట్​ టు డు’ పాటకి కూడా మంచి రీచ్​ వచ్చింది. ఆ సాంగ్​ రిలీజ్​ అయ్యాక  ఎక్కువగా మాస్​, ఫోక్​ సాంగ్స్​ వస్తున్నాయి. 

రెండూ ముఖ్యమే..
చిన్నప్పట్నించీ మ్యూజిక్​, చదువులో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఒక పక్క ​సెమిస్టర్​ ఎగ్జామ్స్​ రాస్తూనే... మ్యూజిక్​లో డిప్లొమాకి ప్రిపేర్​ అయ్యా. అది కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా. చిన్నప్పట్నించీ అలా ట్యూన్​ అవ్వడం వల్ల  ఇప్పుడు జాబ్​తో పాటు ప్లే బ్యాక్​ని కూడా బ్యాలెన్స్​ చేస్తున్నా. రెండింటినీ ఎంజాయ్​ చేస్తున్నా. అలాగే ఫ్యూచర్​లో ఒక్కటే జానర్​కి నన్ను నేను ఫిక్స్​ చేసుకోకుండా డిఫరెంట్​ సాంగ్స్​ ట్రై చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ఐదారు ప్రాజెక్ట్స్​ చేస్తున్నా.

అమ్మానాన్నలే క్రిటిక్స్
 ఏ కాంపిటీషన్​కి వెళ్లినా.. అక్కడ నువ్వు ఏం నేర్చుకోవచ్చు? నీ చుట్టూ ఉన్నవాళ్లలో ఉన్న బెస్ట్​ క్వాలిటీలు ఏంటి?  నీలో నువ్వు ఏం ఇంప్రూవ్​ చేసుకోవచ్చు? అనేవి చూసుకోమంటారు నాన్న. అందుకే చిన్నప్పట్నించీ గెలుపు కన్నా  నన్ను నేను ఇంకా బెటర్​గా ఎలా ప్రజెంట్ చేసుకోవాలన్నదే ఆలోచించా. ఆ ప్రయత్నంలో ఏ కొంచెం లోపం ఉన్నా అమ్మానాన్న వెంటనే నన్ను అలర్ట్​ చేస్తారు . నిజానికి వాళ్లే నా పాటలకి క్రిటిక్స్ కూడా​. నా పాటల్లో పాజిటివ్స్​, నెగెటివ్స్ రెండూ చెబుతారు.  నిజం చెప్పాలంటే నా పాటలు నాకు ఎప్పుడూ తృప్తినివ్వవు. ప్రతి పాట ఇంకా బాగా పాడితే బాగుండేది అనిపిస్తుంటుంది. 

పురాణాలు చదువుతా

  • నా సక్సెస్​ క్రెడిట్​ మా అమ్మానాన్నలతో పాటు నా ఫ్రెండ్స్​కి కూడా దక్కుతుంది.​ నా సింగింగ్​ కెరీర్​కి బిగ్గెస్ట్​ సపోర్ట్​గా నిలిచారు వాళ్లు. పెళ్లి గురించిన ఆలోచన ఇప్పుడు లేదు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందనిపిస్తుంటుంది నాకు. 
  • సంతోషం, బాధ, కోపం.. ఎమోషన్​ ఏదైనా సరే మ్యూజిక్​ వింటా. 
  • ఎమ్మెస్​ సుబ్బలక్ష్మి గారి ​ పాటలు వినడం బాగా ఇష్టం. చిత్రగారి గొంతు  బాగా నచ్చుతుంది. శ్రేయాఘోషల్​ పాటలు  వింటా. 
  • జంక్​, స్పైసీ ఫుడ్​​ ఇష్టంగా తింటా. 
  • పురాణాలతో పాటు ఇంగ్లీష్​ నవలలు కూడా బాగా చదువుతా.  
  • టైం దొరికితే  కొరియన్​ డ్రామాలు, సిరీస్​లు చూస్తా. ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తా.  ఎక్స్​ట్రావర్ట్​లా కనిపించే ఇంట్రావర్ట్​ని నేను. వీణ కూడా బాగా వాయిస్తా.  బీటెక్​ చదివేటప్పుడు  కొన్ని షార్ట్​ ఫిల్మ్స్​లోనూ యాక్ట్​ చేశా.

::: ఆవుల యమున