ధరణికి  వ్యతిరేకంగా పోరాటం చేయాలి

ధరణికి  వ్యతిరేకంగా పోరాటం చేయాలి

మేడిపల్లి, వెలుగు: ప్రభుత్వం ‘ధరణి’తో రైతులను దగా చేస్తోందని ప్రజా గాయకుడు గద్దర్​ ఆరోపించారు. బోడుప్పల్ లోని ఎస్ఎస్ఎస్ ​గార్డెన్​లో గురువారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్ షాపులో పాల్గొని మాట్లాడారు. భూమి అనే పదాన్ని ధరణిగా మార్చి ఎవరికీ అర్థం కాకుండా దగా చేశారన్నారు. భూములు దున్నుతున్న రైతు పేరు ఉండాల్సిన కాలం ఎత్తేసి మోసం చేస్తున్నారని, వెనకటి కాలంలో దొరలు భూస్వాములు అమ్ముకున్న భూములు ఇప్పటికీ వాళ్ల పేరుతో ధరణిలో చూపిస్తున్నాయని తెలిపారు. పోరాడి సాధించుకున్న భూములు ఎవరి పేరున ఉన్నాయో చెప్పాలని గద్దర్ ప్రశ్నించారు. ధరణికి  వ్యతిరేకంగా ఎర్ర జెండా పార్టీలు పోరాటం చేయాలని కోరారు. 

ధరణిలో భూస్వాముల భూమే మిగిలిందని, పేదల, ఇనాం భూములు, ప్రభుత్వ భూములు లేవన్నారు. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్, డీకేఎంయూ జాతీయ, కార్యవర్గ సభ్యులు వెంకట్ రాములు, సమితి సభ్యులు మోతె జాంగారెడ్డి, ఉపాధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్ రావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.